విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్‌ ఉపాధ్యాయులు, పాఠశాలలు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని

మాట్లాడుతున్న మదన్‌మోహన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మున్సిపల్‌ ఉపాధ్యాయులు, పాఠశాలలు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి దవళ సరస్వతి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సర్వీస్‌రూల్స్‌ లేని కారణంగా ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టడం లేదని, దీని వలన అనేక మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ పొందుతున్నారన్నారు. తక్షణమే సర్వీస్‌రూల్స్‌ అమలు చేయాలని కోరారు. ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మదన్‌ మోహన్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పిఎఫ్‌ ఖాతాలు లేని కారణంగా ఆర్థికంగా నష్ట పోతున్నారని, వెంటనే పిఎఫ్‌ ఖాతాలు తెరిపించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సుభాష్‌ బాబు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాఠశాలల సంఖ్య పెంచాలని, పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.వి.అనిల్‌ కుమార్‌, సంఘం కార్యదర్శులు దాసరి రామ్మోహనరావు, చావలి శ్రీనివాస్‌, ఎస్‌ చాణిక్య, ఉపాధ్యక్షులు పి.అప్పలనాయుడు, జి.భీమారావు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్‌వి అనిల్‌కుమార్‌, సదాశివుని శంకరరావు పాల్గొన్నారు.

➡️