వివేకా హత్య కేసులో జగన్‌ పాత్రపై విచారణ జరగాలి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసులో

కూన రవికుమార్‌

టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్రపై సమగ్ర విదారణ జరగాలని, ఆయనును హతమార్చింది ఎవరనేది నిగ్గు తేల్చాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య తరువాత గొడ్డలి పోటుతోనే బాబాయి చనిపోయారని అంత కచ్చితంగా ఎలా చెప్పారో నిజం బయట పెట్టాలన్నారు. అలాగే సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్‌ వేస్తానని సునీత చెపితే… ఎందుకు నిలువరించారో ప్రజలకు తెలిజేయాలన్నారు. అలాగే ఆయన మొదట సిబిఐ విచారణ కోరి తరువాత ఎందుకు వద్దన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివేకా ఎలా చనిపోయారో ఆయనకు తెలిసినా, గోప్యతను ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు రక్షించాలనుకుంటున్నారో బహిరంగ పర్చాలన్నారు. తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతుంటే ఆమెపై వైసిపి నాయకులు ఎదురు దాడి ఎందుకు చేస్తున్నారన్నారు. నిజం బయటకు రాకుండా సిఎం జగన్‌ ఆపుతున్నారని ఆయన చెల్లెలే చెపుతున్నారని, ఆమెకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసిపి శవ రాజకీయాలు మానుకుని తండ్రిని కోల్పోయిన ఆడ బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

 

➡️