విశ్వకర్మ పథకాన్ని వినియోగించుకోవాలి

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని

మాట్లాడుతున్న జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌

  • జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులైన వారు వినియోగించుకోవాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌.వెంకట్రామన్‌ పిలుపునిచ్చారు. నగరంలోని డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో విశ్వకర్మ పథకంపై మంగళవారం నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. 18 రకాలైన కుల వృత్తుల వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి వీలుందన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.మూడు లక్షల రుణం పొందవచ్చని, ఐదు శాతం వడ్డీ చెల్లించి వృత్తిని మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. లీడ్‌బ్యాంకు మేనేజరు సూర్యకిరణ్‌ మాట్లాడుతూ ఈ పథకం శిక్షణకు హాజరైన వారికి మొదటి దశలో రూ.లక్ష రుణం పొందవచ్చని, 5 శాతం వడ్డీతో రుణం తిరిగి చెల్లించిన వారికి ఏడాది వ్యవదిలో రూ.రెండు లక్షల వరకు రుణం పొందడానికి వీలుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారంతా తమ బ్యాంకు అకౌంట్‌ లింక్‌ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ సమయంలో రూ.500 పారితోషికం ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణకు హాజరైన వారికి వారి వృత్తికి సంబంధించిన కిట్‌ను అందజేస్తున్నట్టు చెప్పారు. డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారే కాకుండా అర్హులైన వారందరికీ తెలియజేయాలన్నారు. సదస్సులో జిల్లా పరిశ్రమల అధికారి ఉమామహేశ్వరరావు, బిసి సంక్షేమాధికారి అనురాధ, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌, బిసి కార్పొరేషన్‌ ఇడి గడ్డెమ్మ, ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఎడి డి.వి.ఎస్‌.ఆర్‌ మూర్తి, ఎపిడిఇఇఎ రాష్ట్ర ఎన్‌జిఒ అధ్యక్షులు పి.నాగకుమార్‌, పరిశ్రమల శాఖ ఎడి రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️