వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలి

ఉత్తరాంధ్ర వెనుకబాటును పారదోలాలంటే వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలని

పల్సస్‌ సంస్థ సిఇఒ గేదెల శ్రీనుబాబు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ఉత్తరాంధ్ర వెనుకబాటును పారదోలాలంటే వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలని పల్సస్‌ సంస్థ సిఇఒ గేదెల శ్రీనుబాబు అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను చైతన్యం చేసే దిశగా నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో ఉత్తరాంధ్ర రైతు సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రధాన జీవనాధారం వ్యవసాయమన్నారు. 90 శాతం రైతులకు ఇదే తెలుసునని అందులోనూ సీజనల్‌ పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సకాలంలో వర్షాలు కురవక, సాగునీరు అందుబాటులో లేక సాగు కష్టాలతో ఏటా ఆర్థికంగా కుదేలవుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్ట చేతపట్టుకుని దేశం నలమూలల వలస వెళ్లి జీవనోపాదిని వెతుక్కోవలసి వస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి అన్నదాతలను గట్టెక్కించడం పల్సస్‌ సంస్థ లక్ష్యమన్నారు. పల్సస్‌ ద్వారా అధునాతన ఆవిష్కరణలకు తెరతీస్తున్నామని పేర్కొన్నారు. వరి పొలాల నుంచి అన్నదాతను లాభదాయకమైన పంటల వైపు మళ్లిస్తున్నామన్నారు. సుస్థిర వ్యవసాయ కారిడార్ల ద్వారానే ఉత్తరాంధ్ర వలసలను ఆపి భవిష్యత్‌ను మార్చగలమన్నారు. అందులో భాగంగానే రైతు విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ ద్వారా రైతులను నేరుగా వినియోగదారులకు అనుసంధానించడంపై ఈ సదస్సుల ద్వారా అన్నదాతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 నుంచి 45 దేశాల్లో మన వాణిజ్య ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా దిగుమతి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం పలువురు ఆదర్శ రైతులు, హారికా కన్‌స్ట్రక్షన్‌ అధినేత హారికా ప్రసాద్‌ను సన్మానించారు. సదస్సులో పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర కార్యదర్శి ఆనెపు రామకృష్ణ, తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సురంగి మోహనరావు, తూర్పు కాపు భవన నిర్మాణ కమిటీ కార్యదర్శి లంక గాంధీ, హారికా ప్రసాద్‌, రిటైర్డ్‌ జెసి రెడ్డి గున్నయ్య, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాన కృష్ణచంద్‌ పాల్గొన్నారు.

➡️