సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికం

Mar 5,2024 21:04

ప్రజాశక్తి-పొందూరు : రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. మండలంలోని గోరింటలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనం, తాడివలస రోడ్డు నుంచి పైడిజోగిపేట వరకు రూ.41 లక్షలతో నిర్మించిన బిటి రహదారి, గోకర్ణపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించిన సిసి రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా అవినీతి రహితంగా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపిపి కిల్లి ఉషారాణి, వైసిపి మండల అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, గోకర్ణపల్లి సర్పంచ్‌ చింతాడ మాధురి, మండల జెసిఎస్‌ ఇన్‌ఛార్జి బాడాన వెంకటకృష్ణారావు, వైసిపి యువజన విభాగం మండల అధ్యక్షులు పైడి రాణాప్రతాప్‌, నాయకులు చింతాడ సత్యప్రసాద్‌, కిల్లి నాగేశ్వరరావు, కూన గోపాలం, బొడ్డేపల్లి రమణారావు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బి అధికారుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం
స్థానిక ప్రజాప్రతినిధులకు, నాయకులకు సమాచారం ఇవ్వకుండా రహదారి ప్రారంభోత్సవానికి ఆర్‌అండ్‌బి అధికారులు ఏర్పాట్లు చేయడంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొందూరు మండలంలోని రాపాక పంచాయతీ వావిలపల్లిపేట కూడలి నుంచి వి.ఆర్‌.గూడెం, వయా ధర్మపురం మీదుగా తోలాపి వరకూ నూతనంగా నిర్మించిన రహదారిని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా ప్రారంబోత్సవానికి మంగళవారం ఆర్‌అండ్‌బి అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.6.15 కోట్లతో దాదాపు 8 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టిన రహదారిని ప్రారంభించేందుకు స్పీకర్‌ వచ్చారు. కాని అక్కడ స్ధానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కనిపించకపోవడంతో ఆర్‌అండ్‌బి జెఇ ఆంజనేయ నాయక్‌, కాంట్రాక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి ప్రారంభోత్సవం చేపట్టేటప్పుడు స్ధానికంగా ఉన్న వైస్‌ ఎంపిపి, సర్పంచులు, ఎంపిటిసిలకు సమాచారం ఇవ్వాలి కదా?, ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించారు. ఇలాగేనా రహదారుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసేదంటూ, ప్రారంభానికి నిరాకరిస్తూ వెనక్కి వెళ్లిపోయారు. ఆయన వెంట వైసిపి నాయకులు గుడ్ల మోహనరావు, పకీరు, కోట నాగరాజు, వండాన సూరపనాయుడు, గోవిందరావు, తదితరులు ఉన్నారు.

➡️