సబ్‌ కలెక్టర్‌ ఘెరావ్‌

మండలంలోని అక్కయ్యవలసలో జగనన్న కాలనీలో ఇళ్ల

సబ్‌ కలెక్టర్‌ వాహనం ముందు బైఠాయించిన గ్రామస్తులు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

మండలంలోని అక్కయ్యవలసలో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పరిశీలనకు వచ్చిన టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. అక్కయ్యవలసలో గతంలో సర్వే నంబరు 19లో 25 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇటీవల సర్వేలో ఈ స్థలం చెరువు గర్భంగా చూపించడంతో అధికారులు పట్టాల పంపిణీని నిలుపుదల చేశారు. దీంతో సర్పంచ్‌ ప్రతినిధి సంకరి జనార్థనరావు ఆధ్వర్యాన లబ్ధిదారులు ఇటీవల పలాసలో సిఎం జగన్‌ను కలిసి సమస్యను వివరించారు. మరోసారి పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని సబ్‌ కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. 25 పట్టాల్లో తొమ్మిది మంది గతంలో ఇళ్ల స్థలాలు పొందడంతో వారి పట్టాలను రద్దు చేశారు. మొత్తం సమాచారంతో అధికారులతో కలిసి సబ్‌ కలెక్టర్‌ గ్రామానికి చేరుకున్నారు. చెరువు గర్భం కావడంతో ఇక్కడ పట్టాలు ఇచ్చేందుకు అవకాశం లేదని, వేరే చోట ఇస్తామని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన సర్పంచ్‌ ప్రతినిధి జనార్థనరావుతో పాటు లబ్ధిదారులు మొత్తం 25 మందికీ పట్టాలు మంజూరు చేయాలని సబ్‌ కలెక్టర్‌ వాహనం ముందు బైఠాయించారు. వైస్‌ ఎంపిపి డి.రోజారామకృష్ణ గ్రామస్తులకు నచ్చజెప్పినా వినకపోవడంతో, అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వేరే వాహనంలో సబ్‌ కలెక్టర్‌ తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తులను తప్పించి సబ్‌ కలెక్టర్‌ వాహనాన్ని పంపించివేశారు. సబ్‌ కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌ జామి ఈశ్వరమ్మ, గృహనిర్మాణ శాఖ ఎఇ ఆర్‌.పాపినాయుడు, డిటి ఆర్‌.మధు తదితరులున్నారు.

 

 

➡️