సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

రెగ్యులరైజ్‌ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

  • కాంట్రాక్టు, అవుట్‌్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ చేయాలి
  • సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌
  • సమ్మెకు సిఐటియు, యుటిఎఫ్‌ మద్దతు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రెగ్యులరైజ్‌ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి అధ్వర్యాన సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లాలోని 223 మంది సిఆర్‌పిలు, 315 మంది పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులు, 30 మంది ఎంఐఎస్‌లు, 15 మంది అకౌంటెంట్లు, 30 మంది అటెండర్లు, 30 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు విధులు బహిష్కరించి సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని జ్యోతిబాపూలే పార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు ఉద్యోగులు ప్రదర్శనగా వెళ్లి అక్కడ ధర్నా చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటానికి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, పి.తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. మినిమం టైమ్‌ స్కేల్‌, హెచ్‌ఆర్‌ఎ, డిఎ అమలు చేసి, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్ట్‌ టైమ్‌ విధానాన్ని రద్దు చేసి, ఫుల్‌ టైమ్‌ కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి మినియం ఆఫ్‌ టైం స్కేల్‌ అమలు చేయాలని తెలిపారు. రూ.పది లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, గ్రాట్యుటీ సదుపాయంతో పాటు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీకి వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి సరిపడే బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (జెఎసి) జిల్లా నాయకులు పి.తవిటినాయుడు, ధనుంజయరావు, జె.శ్రీనివాసరావు, ఎం.పోతయ్య, ఎ.అరుంధతి, జి.విజయలక్ష్మి సిహెచ్‌. శైలజ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️