సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించాలి

సాయుధ దళాల పతాక నిధికి అందరూ విరాళాలను అందించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో సాయధ దళాల పతాక

కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పిలుపు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సాయుధ దళాల పతాక నిధికి అందరూ విరాళాలను అందించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో సాయధ దళాల పతాక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ తనవంతు విరాళాన్ని అందించారు. పాకిస్థాన్‌, చైనా యుద్ధ సమయాల్లో, కార్గిల్‌ పోరాటంలో, ముంబై తాజ్‌ హోటల్‌ దురాక్రమణ సమయంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మన సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు దేశం గర్విస్తోందన్నారు. ఎంతోమంది సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించినట్లు చెప్పారు. వీర జవాన్లకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఏటా డిసెంబరు ఏడో తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవానికి జిల్లాలోని పౌరులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను కోరారు. మీరు అందించే విరాళాలను, డైరెక్టర్‌, సైనిక వెల్ఫేర్‌, విజయవాడ పేరున చెక్కు, డ్రాఫ్ట్‌ తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, పెద్దరెల్లివీధి, శ్రీకాకుళంకు పంపాలని కోరారు. పతాకనిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎ.శైలజ, మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు వి.సూర్యనారాయణ, నేవీ ప్రతినిధి ఎస్‌.రమణమూర్తి, ఆర్మీ ప్రతినిధి పి.మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️