సిఎఎతో అందరికీ ముప్పే

ధిబిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం

మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి

ఓట్ల కోసం బిజెపి మతాల మధ్య చిచ్చు పెడుతోంది

ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రజలంతా బాధలు అనుభవించాల్సి ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఇందిరానగర్‌ కాలనీలోని సుందరయ్య భవన్‌లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, జై భారత్‌ పార్టీల ఆధ్యర్యాన ఆదివారం నిర్వహించిన ‘సిఎఎను వ్యతిరేకిద్దాం’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిఎఎ చట్టం దేశ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినందంటూ చెప్పడం అంతకంటే మోసం మరొకటి లేదన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు దేశాల నుంచి కాందిశీకులుగా దేశానికి వచ్చారని చెప్పారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న బర్మా కాలనీ ప్రాంతంలో కాందీశీకులుగా స్థిరపడ్డారని చెప్పారు. ఎపిలో ఈ చట్టంతో సంబంధం లేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమే నన్నారు. సిఎఎ చట్టంతో వాటిల్లే ప్రమాదాన్ని అర్ధం చేసుకోకపోతే అందరికీ ఇబ్బందులు తప్పవని చెప్పారు. దేశంలో ఉన్న ముస్లిముల్లో ఒక రకమైన భయం కల్పించి, వారిని తరిమేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. చట్టం అమలు చేయడం లేదంటూ సుప్రీం కోర్టుకు చెప్పిన బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు అకస్మాత్తుగా అమలుకు సిద్ధమైందన్నారు. మతాల మధ్య చీలిక తెచ్చి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు. జాతీయోధ్యమంలో అన్ని మతాల వారూ పనిచేశారని, ఈ మతసామరస్యమే బ్రిటిష్‌ వారిపై కలిసి పోరాడేలా చేసిందని గుర్తు చేశారు. మతతత్వ శక్తులు, కార్పొరేట్ల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకుండా ఉండటానికే బిజెపి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందన్నారు. మతాల మధ్య ఘర్షణలను నివారించి, వాటి మధ్య సామరస్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కీ.శే. ఎన్‌టిఆర్‌ పని చేశారని, టిడిపి ఇప్పుడు ఆ విధానాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సిఎఎపై జగన్‌ అసలు మాట్లాడటమే లేదని, అన్ని విషయాలపై స్పందించే సజ్జల సైతం స్పందించడలేదని చెప్పారు. సిఎఎ చట్టం కలిగే ప్రమాదం జగన్‌, చంద్రబాబుకు తెలుసునని అన్నారు. ఆ పార్టీల వెనుక కేడర్‌కు దీనివల్ల వాటిల్లే నష్టాని వివరించి పార్టీ అధినేతలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సిఎఎ కలిగే ప్రమాదంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దుర్మార్గమైన సిఎఎ చట్టం తీసుకురావడంతో పాటు దాని అమలుకు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్నికల ముందు ఇటువంటి చట్టం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. దేశ ప్రజలను రెచ్చగొడితే తప్ప ఎన్నికల్లో గెలవలేమని మోడీ భావిస్తున్నారని అన్నారు. అవినీతిని తగ్గిస్తానని 2014 ఎన్నికల ముందు చెప్పిన మోడీ ఇప్పుడు అది తగ్గకపోగా మరింత ఎక్కువ అయిందన్నారు. చట్టం ప్రమాదంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించనప్పుడే చట్టం అమలు కాకుండా ఉంటుందని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడగొట్టేందుకు బిజెపి తీసుకొచ్చిన సిఎఎను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పౌర సత్వ సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. ప్రముఖ విద్యావేత్త ముజిబుర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్ల కోసం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని సిఎఎ చట్టం తీసుకొచ్చారని విమర్శించారు. చట్టంపై ముస్లిముల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. సభకు అధ్యక్షత వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవరి కృష్ణమూర్తి మాట్లాడుతూ దశాబ్ధకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో పాలన సాగిస్తున్న బిజెపి హిందుత్వ అజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి చాపల వెంకటరమణ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వల్ల కలిగే ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పౌరుసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సదస్సులో నాయకులు చాపర సుందర్‌లాల్‌, కె.మోహనరావు, జి.సింహాచలం, ఎం.యుగంధర్‌, వి.జి.కె.మూర్తి, మోహనరావు, ఎం.ప్రభాకరరావు, పి.తేజేశ్వరరావు, అల్లు మహాలక్ష్మి తదితరులు మాట్లాడారు.

 

➡️