సురక్షిత ప్రయాణం లక్ష్యం

సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని బాపూజీ కళామందిర్‌లో ఆటో డ్రైవర్లకు అవగాహనా సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలు అధిగమించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అతి వేగంతో ఆటోలు నడపవద్దని సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లిందీ నమోదు చేసుకోవాలన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటనల సందర్భంలో ఈ వివరాలు ఉపయోగపడతాయని చెప్పారు. హైవేపై వెళ్లేటప్పుడు సర్వీసు రోడ్డును మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. కంటి సమస్యలు ఉత్పన్నమైతే రాత్రి సమయాల్లో ఇబ్బంది మారి ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలా చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రమాద రహిత ఆటో డ్రైవింగ్‌కు అనుసరించాల్సిన పద్ధతులపై ఎంవిఐలు అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్‌ ఏవిధంగా చేయాలన్న దానిపై రెడ్‌క్రాస్‌ సభ్యులు అవగాహన కల్పించారు. అనంతరం కంటి వైద్య నిపుణులు పి.ఎల్‌.రాజు నేతృత్వాన ఆటోడ్రైవర్లకు కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డిఎస్‌పి వై.శృతి, ట్రాఫిక్‌ సిఐ అవతారం, మోటారు వెహికల ఇన్‌స్పెక్టర్లు గంగాధర్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️