సొంతూళ్లకు..

పచ్చని పొలాలు... కల్లాల్లో పండిన పంటలు... తల్లిదండ్రులు... అన్నదమ్ములు... అక్కచెల్లెళ్ల అప్యాయతా అనురాగాలు...

పలాస : రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న వలసదారులు

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

పచ్చని పొలాలు… కల్లాల్లో పండిన పంటలు… తల్లిదండ్రులు… అన్నదమ్ములు… అక్కచెల్లెళ్ల అప్యాయతా అనురాగాలు…. ఉన్నంతలో కలసిమెలిసి సాగే జీవనం… ఒక్కమాటలో చెప్పాలంటే పల్లెలోగిలికి కుటుంబమే అభరణం.. ఇదీ మన పల్లె ఖ్యాతి. కానీ, పల్లెల్లో ఇప్పుడు అ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వీధుల్లో తాళం వేసిన ఇళ్లు.. చెట్ల కింద వృద్దులు నిరీక్షణ… ఏవైనా పండగలు వస్తే తప్ప పల్లెల్లో కళ లేకుండా పోయింది. సొంతూరిని, కన్నవారిని కులుసుకొనేలా ‘సంక్రాంతి’ పండగ తెచ్చింది. పిల్లలంతా బతుకుతెరువుకు పట్టణాలు పోతే ఇంటివద్ద నిరీక్షిస్తున్న ముసలి ప్రాణాలకు మళ్లీ వీరి రాకతో గ్రామాల్లో ప్రేమబంధాలు వెల్లివిరుస్తున్నాయి. గ్రామాల్లో చేసేందుకు పనిలేక పొట్టకూటి కోసం ఊరు విడిచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వలసలు పోవడంతో జనసంచారమే లేక నిన్నటివరకు ఇళ్లకు తాళాలు వేసి బోసిపోయిన గ్రామాలు ప్రస్తుతం జనంతో సందడిగా కనిపిస్తున్నాయి. వలసలతో ఆత్మీయబంధాలతో పాటు బాల్యం కనుమరుగైపోగా అక్కున చేర్చుకునే అలనా, పాలనా కరవై అష్టకష్టాలు పడుతున్న చిన్నారులకు మరో 10 రోజుల పాటు తల్లిదండ్రులు ప్రేమానురాగాలను పొందనున్నారు. సంక్రాంతి పెద్ద పండగ కావడంతో ఉపాధి, ఉద్యోగాలు, వివిధ పనుల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. గత రెండు రోజులుగా శ్రీకాకుళం, పలాసా, టెక్కలిలో ఉన్న రైల్వే, బస్‌స్టేషన్‌లో రైలు, బస్సులు నుంచి దిగిన కూలీలే ఎక్కుగా కనిపించారు. పలాస : సంక్రాంతి పండుగ కోసం వలసజీవులు స్వస్థలాలకు చేరుతున్నారు. ఉద్దానం ప్రాంతం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, నందిగాం, మెళియాపుట్టి తదితర మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు ఉపాది కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా రైళ్లు, బస్సుల్లో వస్తున్నారు. భువనేశ్వర్‌, విశాఖ, విజయవాడ, దుర్గ్‌ వంటి ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఇళ్లకు వస్తుండడంతో పలాస రైల్వేస్టేషన్‌ కిటకిటలాడింది. పలాస రైల్వేస్టేషన్‌లో సాధారణంగా రోజూ ఐదువేల మంది తమ గమ్యస్థానాలు చేరుతుంటారు. సంక్రాంతి కావడంతో ఆ సంఖ్య రెట్టింపయ్యింది. రైల్వేశాఖ ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌, కోల్‌కత్తా, చెన్నరు, బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు వేయడంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రైళ్లు దిగిన వారి బంధువులు స్టేషను రావడంతో తెల్లవారి నుంచే సందడి నెలకొంది. కొందరు సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు ఆటోల్లో స్వస్థలాలకు వెళ్తున్నారు.

 

➡️