‘స్పందన’కు 290 వినతులు

జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన

వినతులు స్వీకరిస్తున్న జెసి నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 290 వినతులు వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జయదేవి వినతులను స్వీకరించారు. ఉద్దానం జీవనాధార పంటైన జీడికి గిట్టుబాటు ధర కల్పించి, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని యుడిఎఫ్‌ అధ్యక్షులు సొర్ర రామారావు వినతిపత్రం అందజేశారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా కళాశాల ఫీజు చెల్లించకపోవడంతో టిసి ఇవ్వలేదని, టిసి ఇప్పించాలని సారవకోట మండలం ధర్మలకీëపురానికి చెందిన జె.సాయిచరణ్‌ తేజ్‌ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని బూర్జ మండలం టిడిఆర్‌ఒ పేటకు చెందిన బండారి రాము ఫిర్యాదు చేశారు. ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. గార మండలం రజక వీధిలో కాలువలు లేక వీధి మురికివాడగా మారుతోందని, కాలువ నిర్మించేలని ఆ వీధికి చెందిన సింగూరు కిరణ్‌ కుమార్‌ వినతిపత్రం అందజేశారు. బిసి కార్పొరేషన్‌ నిధులు పక్కదారి పట్టించి ప్రభుత్వం బిసిలకు తీరని అన్యాయం చేసిందని, కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని బిజెపి ఒబిసి మోర్చా అద్యక్షులు కరుణాకర్‌ ఫిర్యాదు చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో బిజెపి జిల్లా అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిది పూడి తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శవ్వాన ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. కోటబొమ్మాళి మేజరు పంచాయతీ పరిధిలో పలువురు అక్రమణదారులు ప్రభుత్వ భూములను అక్రమించి శాశ్వత భవనాలు, షాపులు నిర్మించుకున్నారని, వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి ప్రభుత్వ భూములను అక్రమణదారుల నుంచి కాపాడాలని సర్పంచ్‌ కాళ్ల సంజీవరావు కోరారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో అర్జీదారుడు సంతప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులను ఆదేశించారు, అర్జీదారుల సమస్యలను సావదానంగా వింటూ, వివిధ సమస్యల పై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఉప కలెక్టర్‌ జయదేవి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి గణపతి రావు డి. ఆర్‌.డి. ఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌ అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అర్జీదారునికి ఇచ్చే సమాధానం పూర్తి వివరాలతో ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ స్పష్టం చేశారు. అందరు విభాగాధిపతులు ప్రజల నుంచి వచ్చే అర్జీలపై అత్యంత శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలన్నారు. జగనన్నకు చెబుదాం వెబ్‌సైట్‌ ద్వారా, జగనన్నకు చెబుదాంలో 1902 నంబరుకు ప్రజలు తెలియజేసే సమస్యలను గడువు లోపు పరిష్కరించాలని ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌, ప్రత్యేక ఉప కలెక్టర్‌ పద్మావతి, డిఎస్‌ఒ వెంకటరమణ, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 

➡️