హింసకు తావు లేదు

హింసకు తావు లేకుండా, ఎన్నికలు తిరిగి నిర్వహించే

మందస : చెక్‌పోస్టు వద్ద పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- మందస, నందిగాం, పలాస

హింసకు తావు లేకుండా, ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్‌.. నో రీపోల్‌), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌ పనిచేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మందస, పలాస, నందిగాం మండలాల్లో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్ధేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పటిష్టంగా పనిచేసేవిధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, ఇవిఎంలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల కోసం ఏర్పాట్లను ఆయా అధికారులంతా వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచ నల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాల న్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నందిగాం మండలం ఆకులరఘు నాథపురం 70వ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అంతకుముందు తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు చేశారు. ఈయనతో పాటు టెక్కలి సబ్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరల్‌ కమర్‌, తహశీల్దార్‌ వి.పద్మావతి, ఎంపిడిఒ జి.శివప్రసాద్‌, టెక్కలి డిఎస్‌పి బాలకృష్ణారెడ్డి, నందిగాం ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ ఉన్నారు. అలాగే సిద్ధిగాం చెక్‌పోస్టును పరిశీలించారు. మందస మండలం చిన్నకోస్త 109వ పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి పలాసలోని ఎఫ్‌ఎస్‌టి బృందాన్ని సందర్శించి పనులపై ఆరా తీశారు. ఈయన వెంట ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌, కాశిబుగ్గ డిఎస్‌పి నాగేశ్వ రరెడ్డి, సిఐ ఈశ్వరరావు, అనిల్‌కుమార్‌ ఉన్నారు.

 

➡️