11 నుంచి ‘శంఖారావం’

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

  • 13 వరకు జిల్లాలో లోకేష్‌ పర్యటన
  • ఇచ్ఛాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం
  • రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన
  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈనెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ వెల్లడించారు. ఇచ్ఛాపురం నుంచి శంఖారావం ప్రారంభం కానుందని తెలిపారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో లోకేష్‌ పర్యటించనున్నారని తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే ‘శంఖారావం’ లక్ష్యమన్నారు. రోజూ మూడు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 11న ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో 12న నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, 13న పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నట్లు వివరించారు. జగన్‌ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పించే దిశగా శంఖారావం సాగుతుందని తెలిపారు.అంకెల గారడీ బడ్జెట్‌ఎన్నికల ముందు అంకెల గారడీతో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌండ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రవికుమార్‌ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకూ నిధులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేటాయింపుల్లో కోతలు పెట్టి పన్నుల భారం మోపేదిగా బడ్జెట్‌ ఉందన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ప్రతి స్కీమ్‌ వెనుక ఒక స్కామ్‌ దాగి ఉందని ఆరోపించారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌ల మొదలు వారికిచ్చే కిట్లు, స్కూళ్లకు వేసిన రంగుల్లో రూ.వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగ పడే అనేక పథకాలను రద్దు చేసి నిధులను దారిమళ్లించారన్నారు. వ్యవసాయ, ఆక్వా, నిర్మాణ రంగం కుదేలైందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

 

➡️