18 కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష

ఈ నెల 17న ఎపిపిఎస్‌సి జరపతల పెట్టిన

మాట్లాడుతున్న జెసి నవీన్‌

హాజరు కానున్న 6,404 మంది అభ్యర్థులు

జెసి ఎం.నవీన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఈ నెల 17న ఎపిపిఎస్‌సి జరపతల పెట్టిన గ్రూప్‌-1 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పరీక్షల నిర్వహణాధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమయపాలనతో పాటు నిర్ధేశిత సూచనలు విధిగా పాటించాలన్నారు. పరీక్షలకు 6,404 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 18 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఒక్కో కేంద్రానికి లైజన్‌ ఆఫీసర్‌ నియమించినట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రవాణా అందుబాటులో ఉండేవిధంగా కేంద్రాలను నిర్ణయించామని అన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్‌టిసి బస్సులు నడపాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా బస్సులను నడపాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. సిటింగ్‌ ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. ప్రథమ చికిత్స కోసం వైద్య బృందాలను నియమించాలని డిఎంహెచ్‌ఒను ఆదేశించారు. పరీక్షా కేంద్రల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా చూడాలన్నారు. ఎపిపిఎస్‌సి నుంచి సహాయ కార్యదర్శి సురేష్‌బాబు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించమని చెప్పారు. పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన పలు అంశాలు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, జిల్లా అధికారులు ఎపిసి జయప్రకాష్‌, జిల్లా పరిషత్‌ సిఇఒ వెంకటరావు, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌కుమార్‌, డిపిఒ వెంకటేశ్వరులు, మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, సూపరెంటెండెంట్‌ రామారావు, క్రాంతి, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

 

➡️