26 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌

సమావేశంలో మాట్లాడుతున్న బలరాం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26 నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.గణేష్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం వెల్లడించారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మున్సిపల్‌ కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పలుమార్లు విన్నవించుకున్నా నాలుగున్నరేళ్లలో ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉద్యోగాలు పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం, ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ హెల్త్‌ అలవెన్స్‌, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు జిఒ నంబరు 7 ప్రకారం రూ.16 వేల కనీస వేతనం అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ చేపడుతున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫెడరేషన్‌ నాయకులు జె.రమేష్‌, ఎ.శేఖర్‌, ఎ.గురుస్వామి, ఎ.మోహన్‌, పి.గణేష్‌, కె.రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️