33వ రోజుకు అంగన్వాడీల సమ్మె

అంగన్వాడీల పోరాటానికి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఎం జిల్లా

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న గోవిందరావు

ప్రజాశక్తి- జిల్లా విలేకరుల యంత్రాంగం

అంగన్వాడీల పోరాటానికి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్‌ వద్ద జ్యోతిభాపూలే పార్కు వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద శనివారం పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె సమంజసమైనదని, నాలుగేళ్లుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బతకాలని ప్రభుత్వానికి ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జిఒ ఇవ్వడం, నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి మాట్లాడుతూ పండగ తర్వాత అంగన్వాడీల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్మా జిఒ కాపీలను ఆదివారం భోగి మంటల్లో దహనం చేస్తామని అన్నారు. ఆమరణ నిరాహారదీక్షలు చేపడుతామని తెలిపారు. ప్రజల్లో వెళ్లి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వివరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కోటి సంతకాలు సేకరణ చేపడతామని తెలిపారు. అంగన్వాడీలు 33 రోజులుగా సమ్మె పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి అంగన్వాడీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని అన్నారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య నిమ్మరసం ఇచ్చి 24 గంటల నిరాహారదీక్షలు విరమింపజేశారు. ఈ శిబిరంలో సిఐటియు నాయుకులు ఆర్‌.ప్రకాష్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయుకులు పాల్గొన్నారు.కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు, గొండు నీలన్న, దుంపల సుధర్శన పాల్గొన్నారు. కొత్తూరులో చేపట్టిన సమ్మెలో ప్రజా సంఘాలు నాయకులు సిర్ల ప్రసాద్‌, నిమ్మక అప్పన్న, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జలజాక్షి, ధనలక్ష్మి, అమ్మాయమ్మ. బోడమ్మ. అరుణ, మధురవేణి, రజని, లక్ష్మి పాల్గొన్నారు.టెక్కలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు చేపట్టిన నిరవధిక సమ్మెలో అంగన్వాడీలు, ఆయాలు, సిఐటియు నాయకులు నంభూరు షణ్ముఖరావు పాల్గొన్నారు. ఆమదాలవలస ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెలో అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు పంచాది లతా దేవి, పి.భూలక్ష్మి, మాధవి, పి.లక్ష్మి, కనకం, సునీత పాల్గొన్నారు. సమ్మె శిబిరం వద్ద భోగి మంటను వేసి పండగ చేసుకుని నిరసన తెలిపారు. ఇచ్ఛాపురంలో మోకాళ్లపై కూర్చొని తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి దండాలు పెడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో హైమా, బాలామణి, కోమలి పాల్గొన్నారు.

 

➡️