50 రోజులైనా ధాన్యం డబ్బులు చెల్లించరా?

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు వెంటనే జమచేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

మాట్లాడుతున్న మోహనరావు

ప్రజాశక్తి- నందిగాం

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు వెంటనే జమచేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. నందిగాంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని, ట్రాన్స్‌పోర్టు డబ్బులూ చెల్లిస్తామని, తరువాత 20 రోజుల్లోగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ, ధాన్యం కొనుగోలు చేసి 50 రోజులవుతున్న ఇప్పటికీ రైతుల ఖాతాలకు డబ్బులు జమ కాకపోవడం అన్యాయమని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు కల్లం వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని, మాది రైతు ప్రభుత్వమని, విత్తు నుంచి విక్రయం వరకు అన్ని రైతు భరోసా కేంద్రాల నుంచే చేపడతామని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని దళారీలను నమ్మి మోసపోకూడదని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎప్పటికీ రైతులకు డబ్బులు చెల్లించకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో 8 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని, ఐదున్నర లక్షల టన్నుల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నులూ కొనుగోలు చేయలేదని వ్యాఖ్యానించారు. తేమ, నాశరకం పేరు చెప్పి 80 కేజీలకు బదులుగా 85 కేజీల వరకు రైతుల వద్ద నుంచి అక్రమంగా తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం గాని, అధికారులు గాని పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాగాది వాసుదేవరావు, పాలిన సాంబమూర్తి పాల్గొన్నారు.

 

➡️