8 నుంచి రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక తరగతులు

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి

లోగోను ఆవిష్కరిస్తున్న అశోక్‌

  • విజయవంతం చేయాలిఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక శిక్షణా తరగతులను జూన్‌ 8 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.చందు, బి.హరీష్‌ తెలిపారు. ఈ తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో శిక్షణా తరగతుల పోస్టర్‌, లోగోను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం మండలం చింతాడ రోడ్డులోని జి.ఎల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల హక్కుల కోసం ఎస్‌ఎఫ్‌ఐ అలుపెరుగని పోరాటం చేస్తోందని చెప్పారు. దేశంలో మతోన్మాద శక్తులను తరిమికొట్టి లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగేది విద్యార్థులు మాత్రమేనన్నారు. ఇటీవల జెఎన్‌టియు యూనివర్శిటీలో ఎస్‌ఎఫ్‌ఐ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద శక్తులను దేశం తరిమికొట్టడానికి ఆ ఎన్నికలు ఆరంభం మాత్రమేనని చెప్పారు. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం గల విద్యనందిస్తూ వారిలో సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. శిక్షణా తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హాజరవుతారని తెలిపారు. నిష్ణాతులైన ప్రొఫెసర్లు విద్యార్థులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ శిక్షణా తరగతులకు అభ్యుదయవాదులు, మేధావులు, ఎస్‌ఎఫ్‌ఐ అభిమానులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్‌, జిల్లా కమిటీ సభ్యులు భూపతి తదితరులు పాల్గొన్నారు.

➡️