చేపల వేట నిషేధాన్ని ధిక్కరిస్తే చర్యలు

చేపల వేటపై ప్రభుత్వం

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

  • మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పి.వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – నౌపడ

చేపల వేటపై ప్రభుత్వం జూన్‌ 14వ తేదీ వరకు నిషేధం విధించిందని మత్స్యశాఖ ఉప సంచాలకులు పి.వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కాలంలో వేట నిషేధాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. సంతబొమ్మాళి మండలం భావనపాడులో చేపల వేట నిషేధం అమలు తీరుతెన్నులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బోటు యజమానులు, మత్స్యకారులతో మాట్లాడుతూ మత్స్య సంపద వృద్ధికి మత్స్యకారులు సహకరించాలన్నారు. సంప్రదాయ తెప్పలకి చేపల వేట నిషేధం నుంచి మినహాయింపు ఉందన్నారు. చేపల వేట నిషేధం ముఖ్య ఉద్దేశం మత్స్య సంపదను పెంపొందించడమేనన్నారు. వేట నిషేధాన్ని ఉల్లంఘించిన వారు సెక్షన్‌ 1994 (4) ప్రకారం శిక్షార్హులు అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు వేట నిషేధిత సమయంలో వేటకు వెళ్లిన వారికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు రూ.2,500 జరిమానా విధిస్తామన్నారు. సముద్రంలో పట్టిన చేపలను వేలం వేస్తామని, పడవలు, వలలు సీజ్‌ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మెరైన్‌ ఎఎస్‌ఐ ఎం.ఆర్‌.కె రెడ్డి, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు ఆదినారాయణ, ఫిషరీస్‌ అసిస్టెంట్‌ ఎల్‌.దామోదర్‌, సాగరమిత్ర శ్రీకాంత్‌, మత్స్యకారులు పాల్గొన్నారు.

➡️