విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టులో

కార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టులో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఎస్‌పి జి.ఆర్‌ రాధిక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీల తీరును పర్యవేక్షించారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, నాటుసారా, గంజాయి, ఓటర్లను ప్రలోభపెట్టే ఇతర సామగ్రి అక్రమ రవాణా కాకుండా ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలోని బెల్లుపడ, ఎ.ఎస్‌ పేట, లొద్దపుట్టి, లండారిపుట్టుగ, మాణిక్యపురం, పెద్ద శ్రీరామపురం, కళింగపుట్టుగ, పలాసపురం, మామిడిపల్లిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల రోజున ఎటువంటి ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ పోలింగ్‌ కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వర రెడ్డి, సిఐలు టి.ఇమ్మన్యునల్‌ రాజు, పి.మల్లేశ్వరరావు, ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

➡️