డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె

Dec 13,2023 16:43 #srikakulam
anganwadi protest 2nd day sklm leader

ప్రజాశక్తి-శ్రీకాకుళం : అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు స్పష్టం చేసారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటి అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది. ఎచ్చెర్లలో జరిగిన ఆందోళనలో యుటిఎఫ్ రాష్ట్ర నాయుకులు ఎస్.కిషోర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ ఆందోళనలో వారు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగినా గత నాలుగు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి డిఎ కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉంది. అంతే కాకుండా అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. తెలంగాణా కంటే కనీసం వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని అన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యాలని తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యటంలేదని అన్నారు. గత 48 సం॥ల నుండి పనిచేస్తున్న అంగన్వాడీలు కనీసం సర్వీసులో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వటం లేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పధకాలు అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు.అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు వివిధ రకాల యాప్లు తెచ్చారని, ఫోన్లు పనిచెయ్యటంలేదని,ఏ ట్రైనింగ్ ఇవ్వటంలేదని, ఏజెన్సీ, మారు మూల ప్రాంతాల్లో నెట్ సిగ్నల్ ఉండటంలేదని తెలిపారు. దీని వలన అంగన్వాడీలు మానసిక వత్తిళ్లకు గురవుతున్నారని అన్నారు. అంగన్వాడీలు దశలవారీగా అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, అధికారులతో చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ పరిస్థితులలో సమస్యలు పరిష్కారం కోసం సెంటర్లని మూసివేసి నిరవధికంగా సమ్మెకు వెళ్ళడం జరిగిందని తెలిపారు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేసారు. మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయజోక్యం అరికట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరి రిటైర్మెంట్ వయసును 62 సం॥కు పెంచాలని డిమాండ్ చేసారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, పెండింగ్లో ఉన్న సెంటర్అద్దెలు, 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దుచెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ వై.విజయలక్ష్మి, శారద,కనకం, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

➡️