అధ్వాన రహదారితో అవస్థలు

మండల కేంద్రానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో

రాళ్లు తేలిన రహదారి

ప్రజాశక్తి- నందిగాం

మండల కేంద్రానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉయ్యాలపేటకు పక్కా రహదారి కలగానే మిగిలిపోయింది. వరదలు వస్తే ముంపునకు గురై గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. వర్షాలు ఎక్కువగా కురిసినా, వరదలొచ్చినా ముంపునకు గురవుతుంది. ఆ సమయంలో బిక్కు మక్కుమంటూ బాహ్యప్రపంచానికి దూరంగా కాలం గడుపుతున్నారు. పాలకుల హామీలే తప్ప రోడ్డు నిర్మాణానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రహదారి నిర్మాణానికి శిలాఫలం ఆవిష్కరించి గ్రామస్తులతో సత్కారాలు పొందారు. తరువాత రహదారి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోతుంది. పుష్కర కాలంలో రెండుసార్లు రహదారి నిర్మాణానికి మంత్రులే శిలాఫలకాలు వేశారు. అయినా పనులు పూర్తి కాలేదు. 2012 వరదల సమయంలో గ్రామానికి వచ్చిన అప్పటి రెవెన్యూ సిబ్బందిని రహదారి నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు నిర్బంధించారు. దీంతో అప్పటి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తుపాను నిధులతో రహదారి నిర్మాణానికి మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కానీ పనులు జరగక పోవడంతో గ్రామస్తులకు రహదారి కష్టాలు తప్పలేదు. 2018లో అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి మెటళ్లు వేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది. దీంతో పనులు ముందుకు సాగలేదు. ఐదేళ్ల తరువాత రోడ్డుపై రాళ్లు తేలిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోజూ ఏదో ఒక చోట వాహనాలు మరమ్మతులకు గురవు తునే ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ రాత్రి గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మించకపోతే వచ్చే ఎన్నికలు బష్కిరిస్తామంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

 

➡️