బిజెపికి ఓటమి భయం

సార్వత్రిక ఎన్నికల మొదటి

సభలో మాట్లాడుతున్న తులసీదాస్‌

  • అసహనంతోనే ఇండియా వేదికపై విద్వేష వ్యాఖ్యలు
  • అణుకుంపటి తెచ్చింది బిజెపినే
  • ఎచ్చెర్లలో ఆ పార్టీని ఓడించండి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల మొదటి విడతలో బిజెపికి ఘోరంగా సీట్లు తగ్గిపోయే సంకేతాలు కనిపిస్తుండడంతో, ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. సిపిఎం బలపరిచిన ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇండియా వేదికకు ఆదరణ పెరుగుతుండడం, మరోవైపు బిజెపికి వ్యతిరేక గాలి వీస్తుండడంతో మోడీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతుందని, అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్‌ నేతలు మహిళల మంగళసూత్రాలనూ వదలరంటూ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ ముందువరకు తమకు 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న బిజెపికి, మొదటి దశ ఎన్నికల్లో తత్వం బోధపడిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి వంద సీట్లలో అభ్యర్థులను మార్చిందని, మరో వంద సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించిందని తెలిపారు. ఈ 200 సీట్లలో గందరగోళంగా ఉందని కొన్ని కార్పొరేట్‌ మీడియా సంస్థలే చెప్తున్నాయన్నారు. ఎన్నికల్లో ధరలు, నిరుద్యోగం తీవ్ర ప్రభావం చూపబోతున్నాయని, ఈ అంశాలపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు.బిజెపి పదేళ్లుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా, విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు, కడపలో ఉక్కు ఫాక్టరీ నిర్మాణం వంటి అంశాలను విభజన చట్టంలో పేర్కొన్నా, మోడీ వాటిని నెరవేర్చలేదన్నారు. పైగా 32 మంది బలిదానాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని బిజెపి ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని చెప్పారు. తనకు 25 ఎంపీ సీట్లను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్‌, బిజెపి ప్రభుత్వానికి లొంగుబాటు ప్రదర్శించారని చెప్పారు. మూడు వ్యవసాయ నల్లచట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సి వంటి అంశాలకు జగన్‌ పార్టీ ఎంపీలు ఓటేయకపోతే రాజ్యసభలో ఆమోదం పొంది ఉండేవి కావని చెప్పారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన విద్యుత్‌ సంస్కరణలనే బిజెపి ఆదేశాలతో జగన్‌ ప్రభుత్వమూ అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, మతసామరస్యం విషయంలో మాజీ ముఖ్యమంత్రి, కీ.శే ఎన్‌.టి రామారావు గట్టి నిలబడ్డారని, ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపికి లొంగిపోయిందని విమర్శించారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపిని, టిడిపి, జనసేన పార్టీలలో నిరంకుశ వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు.అణుకుంపటి తెచ్చింది బిజెపినేజిల్లాకు ప్రమాదకరమైన అణుకుంపటిని తీసుకొచ్చింది బిజెపి ప్రభుత్వమేనని చెప్పారు. మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లోని మితిమిర్ధిలో ఏర్పాటు చేయాల్సిన అణువిద్యుత్‌ ప్లాంట్‌ను అక్కడి ప్రజలు, రైతులు వ్యతిరేకించడంతో, దాన్ని జిల్లాపై రుద్దారని చెప్పారు. బిజెపి ప్రమాదాన్ని ముందు వదిలించుకోవాలని, ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థిని ఓడించాలన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ మూలపేట నిర్వాసితులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేస్తే టిడిపి నోరెత్తలేదని విమర్శించారు. వంశధారలో నీరే లేకుంటే ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందిస్తామంటూ టిడిపి, వైసిపి ప్రజలకు మాయమాటలు చెప్తున్నాయని విమర్శించారు. జిల్లాలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి లేదని, సర్వజన ఆసుపత్రిలో వైద్యులే లేరన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని టిడిపి హయాంలో కూల్చారని, వైసిపి ప్రభుత్వమూ దాన్ని పూర్తి చేయలేదన్నారు. జిల్లాల విభజన తర్వాత ఐటిడిఎ లేని జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో దాన్ని ఏర్పాటు చేస్తామని ఏఒక్కరూ మాట్లాడడం లేదని విమర్శించారు. సభాధ్యక్షులు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. సంకల్ప పత్రం పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన అడుగులకు మడుగులొత్తుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థులను, నిరంకుశ వైసిపిని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు.

➡️