స్వచ్ఛ నాగావళి అందరి బాధ్యత

శ్రీకాకుళం నగరవాసులకు

నాగావళి నదిని శుభ్రం చేస్తున్న యువకులు, కార్మికులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళం నగరవాసులకు దాహార్తిని తీర్చే నాగావళి నది పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ వెంకటరావు పిలుపునిచ్చారు. నగరంలోని హయాతీనగరం ఒడ్డున నాగావళి నది పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి శుభ్రత పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక యువకుని మదిలో వచ్చిన ఆలోచన సామాజిక మాధ్యమాల్లో చూసి నగరవాసులు కలిసికట్టుగా ఇందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రాణులకు అవసరమైన నీటిని నదులు అందిస్తున్నాయని, రైతాంగానికి సాగునీరందిస్తున్నాయని చెప్పారు. నాగావళి నది కలుషితం కాకుండా చూసే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. నగరవాసులు చెత్త, ఇతర వ్యర్థాలను నదిలో వేయకుండా ఇంటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని, వీధుల్లో ఏర్పాటు చేసే చెత్త కుండీల్లో వేయాలని సూచించారు. శ్రీకాకుళం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్‌, ఎస్‌.జోగినాయుడు, జి.ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ జి.ఎన్‌ రావు, టిడిపి నాయకులు వెంకన్న యాదవ్‌, ఐతమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం అధికారులు, విష్ణుమూర్తి, హలో సిక్కోలు ప్రతినిధులు పి.ప్రశాంత్‌, మధు తదితరులు పాల్గొన్నారు

.

➡️