కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

రాష్ట్రానికి ప్రత్యేక హోదా

మాట్లాడుతున్న కృపారాణి తదితరులు

  • ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లే

*  ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలి

  • కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి

ప్రజాశక్తి – టెక్కలి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి, టెక్కలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణి, డిసిసి అధ్యక్షులు ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు అన్నారు. కృపారాణి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని చెప్పారు. అటువంటి పార్టీతో టిడిపి, జనసేన జత కట్టాయని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా బిజెపితో రహస్య చెలిమి చేస్తోందని విమర్శించారు. ఈ పార్టీల్లో దేనికి ఓటు వేసినా అది బిజెపికి వేసినట్లేనని తెలిపారు. విభజన హామీలు అమలు కాకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. పదేళ్ల బిజెపి పాలన దేశాన్ని మూడు దశాబ్దాలు వెనక్కి నెట్టిందని విమర్శించారు. మతం పేరిట చిచ్చు పెడుతోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మోడీ ముందు మోకరిల్లారని ధ్వజమెత్తారు. స్వప్రయోనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తానని గత ఎన్నికల్లో హామీనిచ్చిన జగన్‌, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారన్నారు. నాశిరకం మద్యంతో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారని ఆరోపించారు. పలు నిబంధనలతో సంక్షేమ పథకాలకు అర్హుల సంఖ్యను కుదించారని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే టెక్కలి అభివృద్ధి జరిగిందని కృపారాణి చెప్పారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల పరిదిలోని సుమారు 92 గ్రామాలకు తాగునీటిని ప్రాజెక్టుని మంజూరు చేస్తే, టిడిపి ప్రభుత్వం ఒక్క పంచాయతీకి మాత్రమే పరిమితం చేసిందన్నారు. సంతబొమ్మాళి మండలంలో సుమారు 80 రకాల అభివృద్ధి పనులకు శంకుస్దాపనులు చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం వాటిని శిథిలం చేసిందని చెప్పారు. తన హయాంలో నిధులు మంజూరై శంకుస్థాపనలు చేస్తే, టిడిపి తన ఖాతాలో వేసుకుందన్నారు. ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు ఎన్‌.షణ్ముఖరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో జట్టు కట్టిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు కిల్లి రామ్మోహనరావు, టి.బి.జె గుప్తా, సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️