మురుగుతోనే సహవాసొం

మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని

యాళ్లవీధిలో సిమెంట్‌ రహదారిపై నిలిచిన మురుగునీరు

రోడ్డుపైనే మురుగునీరు 

అనారోగ్యాల బారిన ప్రజలు 

కన్నెత్తి చూడని మున్సిపల్‌ అధికారులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని పదేపదే ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. వివరాల్లోకి వెళ్తే… పురపాలక సంఘ పరిధిలోని ఏడవ వార్డు చింతాడలోని యాళ్లవీధిలో రోడ్డుపై గత తొమ్మిది నెలలుగా మురుగునీరు నిలిచి అక్కడి ప్రజలు రోగాలబారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరి స్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పురపాలక సంఘం ఏర్పడి నేటికి 30 సంవత్సరాల పైబడి కావస్తున్నప్పటికీ వార్డుల్లో మౌలిక సదుపాయాలు నేటికీ పూర్తిస్థాయిలో కానరావడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ పట్టణంలో అధ్వానంగా తయారైంది. డ్రైనేజీ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారులు మొద్దునిద్ర వీడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతాడలోని యాళ్లవీధిలో కాలువలు మూసుకుపోయి మురుగునీరు రోడ్డుపైనే గడిచిన కొన్ని నెలలుగా నిలిచిపోతున్నది. మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని అక్కడ ప్రజలు వాపోతున్నారు. పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు విన్నవించు కున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినప్పటికీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్పా పూర్తిస్థాయిలో పరిష్కరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. తమపై పాలకులు, అధికారులు కక్షపెంచుకున్నారేమోనని యాళ్లవీధికి చెందిన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల మాదిరిగానే తాము కూడా పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని అయినప్పటికీ తమపట్ల పాలకులు, అధికారులకు చిన్నచూపు ఎందుకో అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు కలుగజేసుకొని సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి తమను రోగాల బారినుంచి కాపాడాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

 

➡️