సిపిఎం సీనియర్‌ నాయకులు

సిపిఎం సీనియర్‌ నాయకులు

శ్రీరాములు భౌతికకాయంపై జెండా కప్పి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు

  • శ్రీరాములు కన్నుమూత

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

సిపిఎం సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు (90) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం వేకువజామున నగరంపల్లిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఏప్రిల్‌ 20వ తేదీన బమ్మిడి అప్పయ్య, అప్పలమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించిన ఆయన, చిన్న వయసులోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం ప్రారంభించారు. నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో అనేక ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి, ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారు. 1968 నుంచి 1975 వరకు అజ్ఞాతంలో ఉన్నారు. పార్వతీపురం కుట్ర కేసులో 1975లో అరెస్టయిన ఆయన రెండున్నరేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, జిల్లా కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. ఇటీవల జీడి రైతుల పోరాటం వరకూ అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. కమ్యూనిస్టు విలువలు, ప్రమాణాల కోసం నికరంగా నిలబడ్డారు. 90 ఏళ్ల వయసులోనూ పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఆయన భార్య యశోదమ్మ కరోనా సమయంలో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కె.మోహనరావు తదితరులు శ్రీరాములు భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ జెండాను కప్పి నివాళ్లర్పించారు. శ్రీరాములు మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అంతిమయాత్రలో సిపిఎం నాయకులు జి.సింహాచలం, ఎస్‌.ప్రసాదరావు, ఎన్‌.మోహనరావు, లిబరేషన్‌ నాయకులు టి.సన్యాసిరావు, న్యూడెమోక్రసీ నాయకులు వి.మాధవరావు, తామడ త్రిలోచన, బొడ్డు వాసుదేవరావుతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️