టెక్కలి బరిలో దానేటినేడు నామినేషన్‌

అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా

డాక్టర్‌ దానేటి శ్రీధర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం టెక్కలి

అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జనసేన నాయకులు డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ తెలిపారు. ఈనెల 24వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పత్రికా కార్యాలయాలకు ఫోన్‌ చేసి చెప్పారు. టెక్కలి నియోజకవర్గంలోని లింగాలపాడులో సమావేశం నిర్వహించి తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ను ఓడించడమే లక్ష్యంగా తాను బరిలో దిగుతున్నానని, ఇందులో తన గెలుపోటములను పట్టించుకోనన్నారు. లింగాలపాడులో తన మామ సంపతిరావు రాఘవరావు కుటుంబ మద్దతు కూడా తనకే ఉందన్నారు. కొద్దిరోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి వైసిపి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో దువ్వాడ తరుపున వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ మధ్యవర్తిత్వం నడిపి ఆ నిర్ణయాన్ని వాణి ఉపసంహరించుకునేలా చేశారు. ఇప్పుడు దువ్వాడ తోడల్లుడు దానేటి శ్రీధర్‌ ఆయనపై పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం. వైసిపిలో సుదీర్ఘ కాలం కొనసాగిన దానేటి, ఆ పార్టీ ఎంపీ టిక్కెట్‌ను ఆశించారు. ఆయనకు టిక్కెట్‌ కేటాయించకపోవడంతో, వైసిపిని వీడి జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి పిఠాపురం వెళ్లిన ఆయన, అక్కడ్నుంచే ఫోన్‌ చేసి తాను ఎన్నికల బరిలో నిల్చొంటున్నట్లు తెలిపారు. జనసేన కూడా ఎన్‌డిఎలో భాగస్వామి కావడంతో, తాను కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తానని చెప్పారు. టిడిపి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అండదండలు ఉన్నాయని, తాను కేవలం దువ్వాడ ఓటమి కోసమే పోటీ చేస్తున్నానని తెలిపారు.

➡️