పనిచేయని ఎంపీకి ఓటు వేయొద్దు

జిల్లా అభివృద్ధికి పాటుపడని

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

  • మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు/పలాస

జిల్లా అభివృద్ధికి పాటుపడని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకి ఓట్లు వేయొద్దని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. వజ్రపుకొత్తూరు మండలంలో స్వగ్రామమైన దేవునల్తాడలో ఎన్నికల ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పలాసలో మంత్రి కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా జిల్లాకు చేసిన పని ఒకటైనా రామ్మోహన్‌ నాయుడు చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. మత్స్యకారులను గుర్తించి తీర ప్రాంత, మత్స్యకారుల అభివృద్ధికి జగన్మోహన్‌ రెడ్డి పాటుపడుతున్నారని దీన్ని మత్స్యకారులు గుర్తించాలని కోరారు. తాతలు, తండ్రుల పేరు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, పేదింటిలో పుట్టి కష్టపడి చదివి జగన్‌ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవ చేసి ఓట్లు అడగడానికి తాను వచ్చానన్నారు. వైసిపి ఎంపీ అభ్యర్థి తిలక్‌ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కోసం వైసిపిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి సతీమణి శ్రీదేవి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పాలిన శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్‌, మందస ఎంపిపి డి.దానయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, వైసిపి క్లస్టర్‌ ఇన్‌ఛార్జీలు మద్దిలి హరినారాయణ, దున్న బాలరాజు, సర్పంచ్‌లు అత్తాడ గోపి, సీదిరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

➡️