సమర్థవంతంగా ఎన్నికల విధులు

ఎన్నికల విధులు

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఎన్నికల విధులు సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, సెక్టోరియల్‌ అధికారులు తదితరులతో ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్‌ ఉండాలని ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులు మెయిన్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెబ్‌ కాస్టింగ్‌ శనివారం ట్రయల్‌ వేయాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీటి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సైనేజస్‌ ఏర్పాట్లు చేసే విధంగా సెక్టార్‌ అధికారులకు చెప్పాలన్నారు. సెక్టార్‌ వారీగా వాహనాలు కేటాయించి సైనేజస్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. మాక్‌ పోల్‌, బ్యాలెట్‌ పేపర్లు సరిపోయిందీ, లేనిదీ, ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌ కేంద్రాల వద్ద సమస్యలు, లైటింగ్‌ ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద ఏర్పాట్లు, వాహనాలపై ఫ్లెక్సీ ఏర్పాట్లు, డిస్పాచ్‌ సెంటర్ల వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సెక్టార్‌ వారీగా బస్సులు పెట్టుకోవాలని సూచించారు. వెబ్‌ కాస్టింగ్‌ ఎన్ని ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, వాహనాలు ఎన్ని ఉన్నదీ ఆర్‌ఒలను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ ఉన్నదీ, లేనిదీ అడగ్గా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఒలు వివరించారు. జిపిఎస్‌ వాహనాలు ఎన్ని ఏర్పాటు చేశారని, ఇవిఎంలు, సూక్ష్మ పరిశీలకులు తదితర వాటిపై సమీక్షించారు. రేండమైజేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, నోడల్‌ అధికారులు జయప్రకాష్‌, వాసుదేవరావు, బి.శాంతిశ్రీ, సుధ తదితరులు పాల్గొన్నారు.

➡️