మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణకు అందరూ ఒక్కటై ఉద్యమంలా

మొక్కలు నాటుతున్న హరిత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు

రణస్థలం:

పర్యావరణ పరిరక్షణకు అందరూ ఒక్కటై ఉద్యమంలా మొక్కలు నాటాలని హరిత సమగ్ర గ్రామీణాభివృధ్ధి సంస్థ కన్వీనర్‌ ఆర్‌.హరిబాబు అన్నారు. శుక్రవారం రణస్థలం మండలం కోష్టలో శ్రీరాధా గోవింద మందిరం ఆవరణలో హరిత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల ఉద్యాన మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విచక్షణా రహితంగా చెట్లు నరికివేయడం, మొక్కలు నాటి సంరక్షించాలన్న అవగాహన కొరవడడంతో భూతాపం సుమారు 46 డిగ్రీల వరకూ పెరిగి, మానవులతో సహా మిగిలిన జీవరాశుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం వలన ఋతువులు గతితప్పి, భూ గర్భజలాలు అడుగంటి, భవిష్యత్‌ తరం నీటితో పాటు గాలిని, చెట్టు నీడను కూడా కొనుక్కోవాల్సిన భయంకరమైన పరిస్థితులు దాపురిస్తాయన్నారు. సంస్థ కార్యదర్శి తవిటినాయుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతగా వ్యవహరించి, మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయ ఆవరణలు, పాఠశాలలు, దేవాలయ ప్రాంగణాలు ఎక్కడైనా మొక్కలు నాటాలన్న్న సంకల్పం ఉన్న ఎవరైనా తమ సంస్థ కార్యాలయం నెంబర్‌ 8885328194ను సంప్రదించి పర్యావరణ పరి రక్షణలో భాగస్వాములు కావచ్చని ఆకాంక్షించారు. కార్యక్రమం లో హరిత కార్యకర్తలు పాలూరి శ్రీనివాస్‌, లెక్కల మనోహర్‌, రాధా గోవింద మందిర సిబ్బంది, సేవకులు శ్రీను పాల్గొన్నారు.

 

➡️