మత్స్యకారులకు పూర్తి సహకారం

మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే

మాట్లాడుతున్న గొండు శంకర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని పొట్టి శ్రీరాములు చేపల మార్కెట్‌లో మత్స్య కారులతో శనివారం నిర్వహించిన ముఖా ముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేపల మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బుర్రా సత్తిబాబు, 400 కుటుంబాలతో కలిసి వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వారికి గొండు శంకర్‌ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ అధ్యక్షతన మార్కెట్‌ పరిసర డివిజన్‌ల ఇన్‌ఛార్జిలు మైలపల్లి నర్సింహామూర్తి, బుర్రా ప్రసాద్‌, కొమర కమల, రాజు, బుర్రా సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో శంకర్‌ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుంచి టిడిపికి మత్స్యకారులు అండగా వుంటూ వచ్చారన్నారు. అదే విధంగా వారి సంక్షేమానికి, ఆర్ధికాభివృద్ధికి టిడిపి కృషి చేసిందని గుర్తు చేసారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేసిన ఘనత టిడిపిదేనన్నారు. గత అయిదేళ్ల వైసిపి పాలనలో మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇతర దేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వగ్రామాలకు రప్పించడంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కృషి ఏ ఒక్క మత్స్యకారుడు మర్చిపోలేనిదన్నారు. బోట్ల మరమ్మతులతో పాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందజేయడం జరుగు తుందన్నారు. జిఒ 217ను రద్దు చేస్తామని, వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్ర బాబుకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. వివిధ డివిజన్‌ల ఇన్‌ఛార్జిలు, అనుబంధ విభాగాల నాయ కులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️