ఘనంగా బక్రీద్‌ వేడుకలు

జిల్లావ్యాప్తంగా బక్రీద్‌

ప్రార్థన చేస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లావ్యాప్తంగా బక్రీద్‌ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలరు బలరుతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇళ్లల్లో ఖుర్బానీ నిర్వహించి సంబరంగా పండగను నిర్వహించుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని జామియా మసీదులో సామూహిక ప్రార్థనలో పెద్దసంఖ్యలో ముస్లిములు పాల్గొన్నారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ జామియా మసీదులో ప్రార్థనలు చేశారు. మసీదు కమిటీ సభ్యులు మహిబుల్లా ఖాన్‌, జియావుల్‌ రహ్మాన్‌ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమానత్వం, సేవా దృక్పథం, త్యాగనిరతికి ప్రతీక బక్రీద్‌ అని అన్నారు. మనిషి సేవా నిరతి, క్షమాగుణం అలవర్చుకోవాలన్నదే ఈ పండగ ముఖ్య ఉద్దేశమన్నారు. జామియా మసీదుకు 400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ ప్రాచీన కట్టడాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇస్లాం ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉందని వాటిలో ఏ ఒక్క సూత్రాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదన్నారు. ముస్లిముల రెండో పెద్ద పండగగా నిర్వహించుకునే బక్రీద్‌.. త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుందన్నారు.

➡️