బాబుకు ఓటు వేస్తే పథకాలు రద్దు

ఎన్నికల్లో చంద్రబాబుకు

మాట్లాడుతున్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి

  • మంచి జరిగితేనే వైసిపికి ఓటేయండి

* విప్లవాత్మక మార్పులు తెచ్చాం

* టెక్కలిలో మార్పుకు చోటివ్వండి

* సిద్ధం ముగింపు సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, టెక్కలి, రూరల్‌, సంతబొమ్మాళి

ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే, తాము ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. టెక్కలి మండలంలోని అక్కవరం సమీపంలో బుధవారం నిర్వహించిన సిద్ధం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, దీనిపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ సేవలందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులు పలు సేవలను అందిస్తున్నారని తెలిపారు. ఫించన్‌దారులకు ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పేదల జీవితాల్లో మార్పులు తీసుకురాగలిగామని, మరో ఐదేళ్లు ఇవి కొనసాగాలంటే తమను ఆదరించాలని కోరారు. ప్రతి ఇంటికీ మంచి జరిగితేనే తమకు ఓటు వేయాలన్నారు. చంద్రబాబు నాయుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. మోసాలు, అబద్దాలు చేసే నాయకుడు కావాలా..?, 99 శాతం హామీలు అమలు చేసిన నాయకుడు కావాలో తేల్చుకోవాలన్నారు. ఎన్నికల్లో మాట ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబుకి అలవాటు అని విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానని చంద్రబాబు చెప్పారని… టెక్కలి, శ్రీకాకుళంలో అయినా అది కనిపించిందా అని ప్రశ్నించారు.టెక్కలిలో మార్పుకు అవకాశం ఇవ్వండిటెక్కలిలో జరుగుతున్న చెడుకు స్వస్తి పలికి, మార్పుకు అవకాశం కల్పించాలని కోరారు. టెక్కలి వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ని పరిచయం చేస్తూ ఆయన ఈ మాటన్నారు. వైసిపిని గెలిపిస్తే దువ్వాడ శ్రీనివాస్‌తో మంచి చేయిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌తో పాటు జిల్లాలో పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థులందరినీ పరిచయం చేశారు. సభలో వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, సీదిరి ఆప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్‌, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్‌, గొర్లె కిరణ్‌ కుమార్‌, పిరియా విజయ తదితరులు పాల్గొన్నారు.వైసిపి నాయకుల్లో వర్షం టెన్షన్‌ముఖ్యమంత్రి సభా వేదిక వద్దకు మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటారనగా, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతం చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నాయి. బలమైన గాలులు సైతం వీయడంతో ఒక్కసారిగా దుమ్ము రేగింది. దీంతో వర్షం వస్తుందేమోనని వైసిపి నాయకులు టెన్షన్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత గాలులు నిలిచిపోయి, కారుమబ్బులు తొలగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిఎం ప్రసంగం చివర్లో చిన్నపాటి చినుకులు కురిశాయి.పలువురికి అనుమతి నిరాకరణసిద్ధం సభ కోసం విఐపి పాస్‌లు జారీ చేసినా, పోలీసులు సభాస్థలిలోకి విడిచిపెట్టకపోవడంతో చాలామంది నాయకులు సభ బయటే ఉండిపోయారు. టెక్కలి సర్పంచ్‌ గొండేల సుజాత, ఎంపిటిసి పీత హేమలత, నాయకులు ధవళ కృష్ణారావు వంటి వారికి లోపలకు పంపేందుకు పోలీసులు నిరాకరించారు. గ్యాలరీలో జనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది.ట్రాఫిక్‌ ఇబ్బందులతో జనం అవస్థలుసిద్ధం సభ సందర్భంగా జాతీయ రహదారిపై పలు వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభకు జనాలు తరలిరావడంతో తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. సభ ప్రారంభం, ముగింపు తర్వాత ఒక్కసారిగా జనం రోడ్ల మీదకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర బస్సులు, లారీలు ఇతర వాహనాలు ఆగిపోయాయి. సభ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు, టీ టైం సెంటర్‌లు, దాబాలు మూసివేశారు. జిల్లాలోని నాలుగు ఆర్‌టిసి డిపోల నుంచి బస్సులను సిద్ధం సభకు తరలించడంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను మళ్లించడంతో అవస్థలు పడ్డారు. ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు ప్రయివేట్‌ వంటి వాహనాలను ఆశ్రయించారు.

➡️