‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించాలి

రాష్ట్రానికి తీరని ద్రోహం

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న పరమేశ్వరరావు, వామపక్షాల నాయకులు

  • శ్రీకాకుళంలో బైక్‌ ర్యాలీ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన… తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపిని ఓడించి, ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని డిసిసి అధ్యక్షులు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి కృష్ణారావును గెలిపించాలని కోరుతూ నగరంలో శుక్రవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ రామలక్ష్మణ కూడలి, పెద్దపాడు, కొత్తరోడ్డు మీదుగా డేఅండ్‌నైట్‌ వరకు సాగింది. అక్కడ్నుంచి పిఎన్‌ కాలనీ మీదుగా డేఅండ్‌నైట్‌, సూర్యమహల్‌, ఏడురోడ్ల కూడలి, కళింగరోడ్డు మీదుగా కలెక్టరేట్‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరల్‌ వ్యవస్థను పథకం ప్రకారం బిజెపి ధ్వంసం చేస్తోందని, పౌర హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, రోడ్లు, పోర్టు, విద్యుత్‌, ఆయిల్‌ సెక్టార్‌, రైల్వే తదితర ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసిందన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని చెప్పారు. రాష్ట్రంలో గడచిన ఐదేళ్ల వైసిపి, అంతకుముందు టిడిపి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. జిల్లాలో వలసలను అరికట్టడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు. వంశధార నిర్వాసితుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. వీటన్నింటిని సాకారం చేసుకునేందుకు ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ జాతీయ సహాయ కార్యదర్శి బమ్మిడి గంగాధరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి కృష్ణారావు, సిపిఐ నాయకులు టి.తిరుపతిరావు, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు డి.గోవింద మల్లిబాబు, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి.ఎల్‌.ఎస్‌ ఈశ్వరి, కాంగ్రెస్‌ గార మండల అధ్యక్షులు అంబటి దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️