మలేరియాపై అవగాహన అవసరం

మలేరియాపై ప్రతిఒక్కరూ

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న లింగరాజు

  • డిపిఎం లింగరాజు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

మలేరియాపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ అర్బన్‌ డిపిఎం డాక్టర్‌ పి.లింగరాజు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమకాటు వల్లే మలేరియా వస్తుందన్నారు. చలి, వణుకు, విపరీతమైన జ్వరం ఉంటాయని తెలిపారు. మలేరియా లక్షణాలు ఉన్నవాళ్లు నెలల తరబడి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పారు. తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకుంటే కొంతవరకైనా మలేరియా నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేసుకోవాలన్నారు. గర్భిణులు, పిల్లలు సకాలంలో పరీక్షలు చేసుకుని మందులు వాడాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఆశా, ఆరోగ్య కార్యకర్తలు వ్యాధిని నిర్ధారించేందుకు ఇప్పటికే ర్యాపిడ్‌ డయాగస్టిక్‌ కిట్లను సరఫరా చేశామని తెలిపారు. దోమతెరలు వాడాలని, ఇళ్లలో క్రిమిసంహారక మందు పిచికారీ చేసుకోవాలన్నారు. స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి మలేరియా రహిత శ్రీకాకుళంగా అందరం సామాజిక స్పృహతో, బాధ్యతతో సమాజాన్ని చైతన్యపరిచి మలేరియా నిర్ధారణ ఉచిత చికిత్సకు తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పి.వి సత్యనారాయణ, ఎల్‌.శ్రీకాంత్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, మలేరియా కన్సల్టెంట్‌ శ్రీకాంత్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మి, ఎఎన్‌ఎమ్‌లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️