మొబైళ్లకు లాక్‌ తప్పనిసరి

మొబైల్‌ ఫోన్లు వాడే

మొబైల్‌ను అందజేస్తున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

మొబైల్‌ ఫోన్లు వాడే ప్రతిఒక్కరూ ఫోన్లకు లాక్‌ అండ్‌ సెక్యూరిటీ తప్పనిసరిగా వేసుకోవాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అన్నారు. అందుబాటులో ఉన్న కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఫోన్లలో ఉండే డేటాకు సెక్యూరిటీ వేసుకోవాలన్నారు. జిల్లాలో మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్న 72 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన అనంతరం బిల్లు, ఐఎంఇఐ నంబరు, ఇతర వివరాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు. విలువైన సమాచారాన్ని ఫోన్లు ఉంచకుండా జాగ్రత్త వహించాలన్నారు. పోగొట్టుకున్న మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన సైబర్‌ సెల్‌ సిబ్బందిని ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్‌ పోగొట్టుకున్న బాధితులు డాట్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీ కమ్యూనికేషన్‌) ఆధ్వర్యాన ఉన్న సిఇఐఆర్‌.గవర్నమెంట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో పోగొట్టుకున్న మొబైల్‌ను తిరిగి పొందేందుకు బ్లాకింగ్‌ రిక్వెస్ట్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలని చెప్పారు. మొబైల్‌ ఐఎంఇఐ నంబర్లు బ్లాక్‌ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్‌ను తాము రిసీవ్‌ చేసుకుని, ఆ మొబైల్‌ను ట్రాక్‌ చేసి రికవరీ చేశాక అన్‌బ్లాక్‌ చేసి మొబైల్‌ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నట్లు తెలిపారు. సిఇఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 202 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామన్నారు. జిల్లా పోలీస్‌ వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.శ్రీకాకుళంపోలిస్‌.ఇన్‌లో జిల్లా ప్రజల కోసం అందుబాటులో ఉంచిన లాస్ట్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఇప్పటివరకు 244 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.64 లక్షల విలువ గల 518 ఫోన్ల వరకు రికవరీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు జి.ప్రేమ్‌కాజల్‌, వి.ఉమామహేశ్వరరావు, సైబర్‌ సెల్‌ సిఐ శ్రీనివాస్‌, సైబర్‌ సెల్‌ సిబ్బంది రమేష్‌, శేషగిరి, శరత్‌, అరవింద్‌, సత్యనారాయణ, సుధీర్‌ పాల్గొన్నారు.

➡️