టిడిపిని నమ్మే స్థితిలో లేరు

తెలుగుదేశం పార్టీని ప్రజలు

మాట్లాడుతున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • 24న నామినేషన్‌
  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని వైసిపి కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ధర్మపురి గౌరీ శంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి సమావేశాలు, సభలకు జనాల్లేక వెలవెలబోతున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తర్వాత అమలు చేయరని ప్రజలు గ్రహించారని చెప్పారు. వైసిపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మరింత బాగా పనిచేయాలని సూచించారు. డివిజన్‌ ఇన్‌ఛార్జీలు తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం సాగించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలో ఉన్నవాళ్లందరూ సోషల్‌ వర్కర్స్‌ అని తెలిపారు. ఎన్నికలకు మరో నెల రోజులు సమయం ఉందని, పార్టీ కార్యకర్తలంతా ఏకతాటిపై నడిచి, ఇప్పటిదాకా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విద్యావంతుల సంఖ్య ప్రతి ఐదేళ్లకూ పెరుగుతోందన్నారు. అందుబాటులోకి వచ్చిన మాధ్యమాలను, సాంకేతికతను వినియోగించుకుని పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై డిజిటల్‌ ప్రచారం విస్తృత రీతిన సాగించాలని సూచించారు. ఈనెల 24వ తేదీన తాను నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈలోగా డివిజన్ల పరిధిలో అన్ని ఇళ్లకూ నాయకులు వెళ్లాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

➡️