హామీలే మిగిలాయి

మండలంలో పెంట, నాగులవలస, దేవరవలస నుంచి

గోతులమయంగా ధవళపేట నుంచి సంతవురిటి వెళ్లే రహదారి

అడుగు తీసి వేయలేని స్థితిలో గ్రామీణ రోడ్లు

పదేళ్లుగా ఇదే దుస్థితి..ొపట్టించునే దిక్కే లేదు

అవస్థలు పడుతున్న మండలవాసులు

ప్రజాశక్తి- జి.సిగడాం

మండలంలో పెంట, నాగులవలస, దేవరవలస నుంచి గిర్సిపూడి రోడ్డు, అలాగే నిద్దాం, అద్దోనంపేట, టిడివలస, సంతవురిటి గ్రామాలకు వెళ్ళే అంతర్గత రహదారులు అధ్వానస్థితిలో ఉన్నాయి. మండల కేంద్రం నుంచి పొగిరి మీదుగా పెంట, నాగులవలస వెళ్లే రోడ్లపై నడవాలంటే నరకయాతనే. అలాగే పాలఖడ్యం నుంచి టిడి వలస వెళ్ళాలంటే రోడ్డంతా గుంతలతో దర్శనం ఇస్తుంది. మండల కేంద్రం నుంచి అద్దోనంపేట, నిద్దాం గ్రామానికి వెళ్లాలన్నా లేదా మండ లానికి గ్రామస్తులు, విద్యార్థులు స్కూల్‌కి రావాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు.2014లో రాష్ట్ర విభజన తర్వాత ఈ రోడ్లు దుస్థితిని పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఫలితంగా మండలంలో అనేక గ్రామాలు, వీధులకు వెళ్లే అంతర్గత రోడ్లన్ని దైన్యస్థితికి చేరుకున్నాయి. రోడ్లపై పెద్దగోతులు ఏర్పడి, వర్షాలు కురిస్తే వాటిల్లో నీరు నిండిపోవడంతో దమ్ము పొలాలను తలపిస్తున్నాయి. కాలినడకన వెళ్లాలంటేనే ఆయా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందంటే, ఆయా గ్రామాలకు మోటార్‌ వాహనాలు, ఇతరత్రా వాహ నాలు వెళ్లాలంటే చాలా కష్టమని తెలుస్తుంది. రోడ్లు దుస్థితిపై అధికారులు, నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించే దిక్కు లేదని మండల ప్రజల వాపోతున్నారు. విభజన తర్వాత టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఏ ఒక్కరూ తమ గోడును పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదని, దీంతో గోతుల రోడ్లపై అవస్థలు పడు తున్నామని ఆందోళన చెందుతున్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు సైకిల్‌ మీద వెళ్లి రాలేని పరిస్థితిలో ఉన్నామని వాపో యారు. విద్యార్థులు ఒక్కోసారి ఆ గుంతల్లో పడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక నేతలతో పాటు అధికారులు స్పందించి, మండల కేంద్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీల రహదారులను బాగుచేయించి నడిచి వెళ్లేందుకు యోగ్యంగా మార్చాలని పెంట, నిద్దాం ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల వేళ రోడ్లు వేస్తాం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన నేతలు కనిపించడం లేదు. నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేనంతగా రోడ్లు పాడయ్యాయి. ఆస్పత్రికి, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు, నేతలు కళ్లు తెరిచి మా కష్టాలు చూడండి. రోడ్లు బాగుచేయండి అని గ్రామస్తులు కోరుతున్నారు.

 

➡️