గోతుల రోడ్డుపై గళం విప్పిన జనొం

మరమ్మతులకు నోచుకోక గతుకులమయమైన

రోడ్డుపై బైఠాయించిన స్థానికులు

శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డుపై నిరసన

తక్షణమే పనులు పూర్తి చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మరమ్మతులకు నోచుకోక గతుకులమయమైన శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ జనం రోడ్డెక్కారు. శ్రీకాకుళం – ఆమదాలవలస రహదారిపై మండలంలోని వాకలవలస వద్ద ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ చేపడతామని నాయకులు చెప్పి అప్పట్లో మరమ్మతులు చేపట్టకుండా విడిచిపెట్టారనిన్యాయవాదులు బొడ్డేపల్లి మోహనరావు, పైడి విశ్వేశ్వరరావు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్భాటంగా పనులు ప్రారంభించి ఉన్న రోడ్డును గోతులమయం చేసి గాలిలో వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల వ్యవధిలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై 20 మంది వరకు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. గోతులమయమైన ఈ రహదారిపై ప్రయాణించి వేల మంది వాహనదారులు ఆనారోగ్యం పాలయ్యారన్నారని చెప్పారు. నిత్యం ఈ రహదారిపై ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారని ధ్వజమెత్తారు. సుమారు పది కిలోమీటర్ల పొడవునా పెద్ద పెద్ద గోతులతో దారుణంగా ప్రధాన రహదారి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌కు వెళ్లే వాహనాలు, రాయఘడ, పర్లాకిమిడి, గుణుపూర్‌, పాలకొండ, పార్వతీపురం, కొత్తూరు, పాతపట్నంతో పాటు ఇతర మండల కేంద్రాలకు వెళ్లాలన్నా ఈ రోడ్డు ప్రధానమైందని వివరించారు. తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ తక్షణమే జోక్యం చేసుకుని ఆర్‌అండ్‌బి అధికారులతో చర్చించి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

➡️