పూలే ఆశయసాధనకు కృషి

సమ సమాజ నిర్మాణంలో

పూలే చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న డిఆర్‌ఒ గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమ సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, అదే మహాత్మా జ్యోతిరావు పూలేకు ఇచ్చే ఘన నివాళి అని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు అన్నారు. పూలే 198వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి పూలే అని అన్నారు. బహుజన సామాజిక విప్లవోద్యమ పితామహుడని కొనియాడారు. అణగారిన, బలహీన వర్గాల వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి గ్రామాల్లో పూలే వినూత్న కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. పూలే కన్న కలలను సాకారం చేసేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహలు అరికట్టడానికి కీలక పాత్ర వహించారన్నారు. మహిళలకు సమాజంలో విద్య అవసరమని గుర్తించిన మహోన్నత వ్యక్తి అని, అటువంటి మహనీయుల అడుగుజాడల్లో అందరూ నడవలన్నారు. బిసి సంక్షేమ అధికారి ఇ.అనురాధ పూలే జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్‌ సింగ్‌, బిసి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి.చిన్నారావు, పలు శాఖల అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️