పోలీసు వలయంలో పోర్టు ప్రాంతాలు

సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు ప్రాంతాలను

నౌపడలో మోహరించిన పోలీసు బలగాలు

అదనపు బలగాలు మోహరింపు

144 సెక్షన్‌ అమలు

60 మంది టిడిపి నాయకుల గృహ నిర్బంధం

ప్రజాశక్తి – నౌపడ

సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూలపేట పోర్టుకు రాళ్లు తరలించే వాహనాలను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అనుచరులు అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎస్‌పి జి.ఆర్‌ రాధిక చర్యలు చేపట్టారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నౌపడ, పాలవానిపేట, రావివలస, మూలపేట, ఎం.సున్నాపల్లి, కె.లింగూడు, టెక్కలి పట్టణం తదితర ప్రాంతాల్లో 650 మంది బలగాలను మోహరించి, 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ప్రవేశ మార్గాల్లో ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి, కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. నౌపడలో శుక్రవారం రాత్రి నుంచే అదనపు బలగాలను రప్పించి, ప్రధాన కూడలిలో పోలీసు సిబ్బంది పహారా కాశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగవద్దని ప్రజలకు సూచించారు.టిడిపి నాయకుల గృహ నిర్బంధంసంతబొమ్మాళి మండలం నౌపడ, సీతానగరం, మర్రిపాడు, మూలపేట, యామాలపేట, హనుమంతునాయుడుపేట, ఆకాశలఖవరం, కె.లింగూడు, సున్నాపల్లి తదితర ప్రాంతాలకు చెందిన టిడిపి నాయకులకు పోలీసులు నోటీసులు అందించారు. శాంతిభద్రతల దృష్ట్యా వారిని గృహ నిర్బంధం చేశారు. నౌపడలో టిడిపి మండల అధ్యక్షుడు జీరు భీమారావు, మాజీ ఎంపిపి కర్రి విష్ణుమూర్తి, నాయకులు కూచెట్టి కాంతరావు, మెండ అప్పారావు, అరుణ్‌ కుమార్‌, వసంతకుమార్‌, భాస్కరరావుతో పాటు 60 మందికి సిఆర్‌పిఎస్‌ 149 సెక్షన్‌ ప్రకారం నోటీసులు అందించి గృహ నిర్బంధం చేశారు.

 

➡️