ఖరీఫ్‌కు వరి విత్తనాలు సిద్ధం

ఖరీఫ్‌ సాగుకు
  • ఆర్‌బికెల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభం

* 3.87 లక్షల ఎకరాల్లో వరి సాగు

  • తక్కువ కాలంలో పంట దిగుబడిపై దృష్టి

* వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఖరీఫ్‌ సాగుకు సంబంధించి రైతులను అన్నివిధాలుగా సన్నద్ధం చేస్తున్నట్లు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ తెలిపారు. సాగుకు అవసరమైన విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4.35 లక్షల ఎకరాల్లో వేసేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అందులో 3,87,323 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌కు సంబంధించి పలు అంశాలపై ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వెల్లడించారు.

ఖరీఫ్‌ సాగుకు రైతులను ఏవిధంగా సన్నద్ధం చేస్తున్నారు?

ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ఇప్పటికే వర్షాలు కురవడంతో రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులకు అవసరమైన అన్నిరకాల విత్తనాలను రైతుభరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించాం. ఇప్పటికే విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎరువులను కూడా రైతుభరోసా కేంద్రాల్లోనే అందిస్తున్నాం. రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలు, మెళకువలను వ్యవసాయశాఖ అధికారులు, సహాయకులు అందిస్తున్నారు.

విత్తనాల సరఫరా ఏమేరకు చేపట్టారు?

విత్తనాభివృద్ది సంస్థ ద్వారా జిల్లాలో 36,420 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశాం. వీటిలో రాయితీపై మరికొన్ని నిర్దేశించిన ధరకు విక్రయించాల్సి ఉంటుంది. పలు రాయితీ విత్తనాలు 34,200 క్వింటాళ్లుఅందుబాటులో ఉన్నాయి. వాటిలో మార్టేరు సాంబ 25 కేజీల ప్యాకెట్‌ రూ.1045 కాగా రూ.250 రాయితీ, రూ.795 రైతు చెల్లించాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంత రైతులకు రూ.940.50 రాయితీ, రూ.104.50 రైతు చెల్లించాల్సిన ధరగా నిర్ణయించాం. పలురకాల విత్తనాలకు నిర్ణయించిన ధరలకు అనుగణంగా రాయితీ లభిస్తోంది. ఐదు గిరిజన సబ్‌ప్లాన్‌ మండలాల్లో రైతాంగానికి 2,220 క్వింటాళ్ల విత్తనాలు 90శాతం రాయితీపై అందించేందుకు సిద్ధం చేశాం. జిల్లాలో రైతుల అవసరాలకు తగ్గట్లుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

ఖరీఫ్‌ పంటల కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?

జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,35,165 ఎకరాల్లో వేసేలా ప్రణాళికను సిద్ధం చేశాం. అందులో 3,87,323 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా. జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు తదితర తృణ ధాన్యాలు 26,685 ఎకరాల్లో సాగవుతాయి. వీటిలో సజ్జలు 165 ఎకరాలు, మొక్కజొన్న 26,375 ఎకరాలు, రాగులు 145 ఎకరాల్లో సాగు చేసే అవకాశముంది. ఈ సీజన్‌లో 860 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగు లక్ష్యంగా నిర్ధేశించడమైంది. వీటిలో కందులు 335 ఎకరాలు, పెసలు 252.5 ఎకరాలు, మినుములు 272.5 ఎకరాల్లో వేయనున్నారు. నూనెగింజలు 1430 ఎకరాల మేర సాగయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిలో వేరుశనగ 1332.5 ఎకరాలు, నువ్వులు 97.5 ఎకరాల్లో సాగు చేయొచ్చని అంచనా. పత్తి 4,620 ఎకరాలు, గోగు పంట 257.5 ఎకరాలు, చెరుకు 4,550 ఎకరాల్లో వేయనున్నారు. మిరప పది ఎకరాలు, ఉల్లి 2.5 ఎకరాలు, పసుపు 60 ఎకరాల్లో సాగు చేయనున్నారు.

నైర వ్యవసాయ కళాశాలలో కొత్త వరి వంగడాలు ఈ ఏడాది అందుబాటులో ఉన్నాయా?

ఎన్‌.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నైర వ్యవసాయ కళాశాల ఏటా ఫౌండేషన్‌ సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పలురకాల ఫౌండేషన్‌ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఏడాదీ కళాశాల తరపున విత్తనాభివృద్ధి జరిగింది. రైతుస్థాయిలో విత్తనోత్పత్తి చేయడానికి అవసరమైన వరి నాణ్యమైన మూల విత్తనం అందించడమైంది. అత్యధిక జన్యు స్వచ్ఛత (99 శాతం), భౌతిక స్వచ్ఛత (98 శాతం), మొలక (80-100శాతం), నిర్దేశింపబడిన తేమశాతం (11-13 శాతం) ఉండే విత్తనాలను వారు సిద్ధం చేస్తున్నారు. ఏటా వారి నుంచి తీసుకుంటున్న విత్తనాల వల్ల రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతోంది. సాంబమసూరి (బిపిటి 5204), స్వర్ణ (ఎంటియు)7029, ఎంటియు 1121 (శ్రీధతి), ఎంటియు 1224 (మార్టేరుసాంబ), ఎంటియు 1210 (సుజాత), ఎంటియు 1061 (ఇంద్ర), ఎంటియు1064 (అమర), ఎంటియు1318 (ఫ్రీ రిలీజ్డ్‌), వంటి వాటితో పాటు ఏటా కొత్త రకాన్ని పరిచయం చేస్తున్నారు.

ఎరువుల వాడకంలో రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?

అధిక దిగుబడులు, పంటలో చీడపీడల నివారణకు ఎరువులు, పురుగు మందులను రైతులు అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. వాటి వాడకాన్ని తగ్గించేందుకు వీలుగా రైతుల్లో ఇప్పటికే అవగాహన కల్పించడమైంది. గ్రామ, మండలస్థాయి వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ఎరువుల వాడకంపై తగిన సూచనలు చేస్తున్నారు. సాగు సమయంలో రైతులు నేరుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సిఫార్సు చేసిన మోతాదుల్లో మాత్రమే వాడితే రైతులకు మేలు చేకూరుతుంది. పొటాష్‌ వాడకం మొదటి విడతగా దమ్ములో, రెండో విడతగా అంకురం సమయంలో వేసుకోవాలి. మేలైన నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం పాటించకపోవడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతోంది.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జిల్లాలో వర్షాబావ పరిస్థితులు ఎదుర్కొనే మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా పలు పంటలను సాగు చేసుకునేందుకు వీలుంది. ఈ ప్రాంతాల్లో రాగి, వేరుశనగ, మినప, పెసర, పిల్లి పెసర, దైంసా, సన్‌ ఫ్లవర్‌ సాగుకు అనుకూలం. అందులో భాగంగా జిల్లాలో సన్‌ఫ్లవర్‌ 516 క్వింటాళ్లు, దైంసా 1020 క్వింటాళ్లు, పిల్లి పెసర నాలుగు క్వింటాళ్లు, పెసర 90 క్వింటాళ్లు, మినుములు వంద క్వింటాళ్లు, రాగి 32 క్వింటాళ్లు, వేరుశనగ 700 కింటాళ్లు సిద్ధం చేయడమైంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే రైతాంగానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగణంగా అందించనున్నాం.

➡️