దశల వారీ పోరాటాలకు సన్నద్ధం

దశల వారీ పోరాటాలకు సన్నద్ధం

మాట్లాడుతున్న మహాలక్ష్మి

  • ఎండిఎం యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మహాలక్ష్మి

ప్రజాశక్తి – హిరమండలం

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన యూనియన్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనం రూ.పది వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించడం లేదని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయకుండా పని చేయించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, కార్మికుల బతుకుల్లో మార్పు లేదన్నారు. మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచడం లేదని చెప్పారు. వంట సమయంలో ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించి వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వంట గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించే పద్ధతి ఆపాలని కోరారు. పాఠశాలలో మంచినీరు, వంటషెడ్డు, వంటపాత్రలు తదితర మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెలా ఐదో తేదీ లోపు వేతనాలు, బిల్లులు చెలించడంతో పాటు మెనూ ఛార్జీలను రూ.20కి పెంచాలన్నారు. కార్మికుల్లో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి మట్టి ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. వంట కార్మికుల సమస్యలపై యూనియన్‌ ఆధ్వర్యాన పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కాలేదన్నారు. కొత్త ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘ మండల నాయకులు జి.చెంచులక్ష్మి, వి.నాగరత్నం, కె.రేణుక, ఎన్‌.పార్వతి, ఎ.గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️