తగ్గిన మామిడి దిగుబడులు

మామిడి పండ్లకు మార్కెట్లో ధరలు ధరలు ఆశాజనకంగా

దిగుబడి తక్కువుగా ఉన్న మామిడి చెట్లు

ఆందోళనలో రైతులు

ప్రజాశక్తి- బూర్జ

మామిడి పండ్లకు మార్కెట్లో ధరలు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మండలంలో సుమారు 60 ఎకరాలకుపైగా మామిడి సాగులో ఉంది. బంగినపల్లి, చెరుకు రసాలు, తీయమామిడి, నీలం, కలెక్టర్‌ తదితర రకాల మామిడికాయలు సాగు చేస్తున్నారు. మండలంలో పండే మామిడికాయలను బెంగళూరు, హైదరాబాద్‌, నెల్లూరు, ఒంగోలు, రాయపూర్‌, విజయవాడ వంటి పట్టణాలకు ఎగుమతి చేస్తారు. గతేడాది టన్ను బంగినపల్లి మామిడి పండ్లు రూ.20వేల నుంచి రూ.30 వేలు ఉండగా ఈ ఏడాది రూ.42 వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఎగబాకిందని రైతులు తెలిపారు. సరైన వర్షాలు కురువకపోవడంతో పూత ఆలస్యంగా మొదలైందన్నారు. పింజె దశలో ఉండగానే తెగుళ్లు ప్రారంభం కావడంతో ఎన్ని మందులు పిచికారి చేసిన ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దీంతో దిగిబడులు తగ్గిపోయాయి. మే నెలలో మార్కెట్లోకి అన్ని రకాల మామిడి కాయలు, పళ్లు రావాల్సి ఉండగా అరకొరగా వచ్చాయి. ఎండ తీవ్రత కూడా పెరగడంతో మార్కెట్లోకి పూర్తిస్థాయిలో వస్తాయి. మామిడి మార్కెట్లో బంగినపల్లి మామిడికాయలకు విపరీతమైన గిరాకీ ఉంది. కొంతమంది మామిడి సాగు రైతులు పక్వానికి వచ్చిన మామిడి కాయలను మార్కెట్లోకి తరలిస్తున్నారు. కేవలం 3 నుంచి 4 టన్నులు మాత్రమే దిగిబడి వస్తున్నాయి. సగం దిగిబడులు తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని కౌలు రైతులు చెప్తున్నారు. నూటికి 40శాతం తోటలో మామిడికాయలు కాశాయి. మిగతా మామిడి దిగుబడి రాలేదని చెబుతున్నారు. మామిడికాయల ధరలు జూన్‌లో కూడా నిలకడగా ఉంటే పెట్టుబడులతో పాటు కొద్దిగా లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడి ధరలు విపరీతంగా పెరిగినా సామాన్య ప్రజలు మామిడికాయలు కొని, తినే పరిస్థితి లేదన్నారు. దీనివలన అమ్మకాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయని రైతులు తెలిపారు.

 

➡️