గొంతెండుతోంది

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ

ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఎఎస్‌పేటలో ట్యాంకర్ల వద్ద మంచినీటి కోసం మహిళ పాట్లు

  • 2,519 గ్రామాలకు పాక్షికంగానే తాగునీరు
  • మరమ్మతులకు గురైన పలు పథకాలు
  • చేతిపంపులదీ అదే పరిస్థితి
  • మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల నీరే దిక్కు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ రోజుల్లోనే పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో వేసవి ప్రారంభం కావడంతో నీటి సమస్యలు మొదలయ్యాయి. జిల్లాలో సగానికి పైగా గ్రామాల్లో పాక్షికంగానే తాగునీరు అందుతోంది. సమగ్ర, రక్షిత, సింగిల్‌ విలేజ్‌ స్కీమ్‌లు చాలాచోట్ల మరమ్మతులకు గురయ్యాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రతి ఏగాదీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేవారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా మంచినీటి కనెక్షన్లు ఇస్తున్నామనే పేరుతో ప్రభుత్వం రెండేళ్లుగా సరఫరా నిలిపివేసింది. పాత పథకాలను ఆపేయడం, కొత్తవి ప్రారంభం కాకపోవడంతో గ్రామాల్లో మంచినీటికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మున్సిపాల్టీల్లోనూ మహిళలకు నీటి వెతలు తప్పడం లేదు.గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 4,037 గ్రామాలు ఉండగా, కేవలం 1518 గ్రామాలకే తాగునీరందుతోంది. 2,519 గ్రామాలకు పాక్షికంగానే తాగునీటి సరఫరా జరుగుతోంది. జిల్లాలో 38 సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలు ఉండగా, ఏ ఒక్క పథకమూ సక్రమంగా పనిచేయడం లేదు. జిల్లాలో ఉన్న 918 రక్షిత మంచి నీటి పథకాల పరిస్థితి అలానే ఉంది. జిల్లాలో 15,848 చేతిపంపులు ఉన్నా, ఎప్పటికప్పుడు మొరాయిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రోజుకు 70 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా, 55 లీటర్ల నీటిని మాత్రమే అందించగలుగుతున్నారు. ఆ మేరకు తాగునీటిని అందిస్తున్న గ్రామాలు 1521 మాత్రమే ఉన్నాయి. పాక్షికంగా తాగునీరందుతున్న గ్రామాలు 2,497 గ్రామాలు ఉన్నాయి.పథకాల మరమ్మతులతో తప్పని ఇబ్బందులుజిల్లాలో 192 చిన్న రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. వాటిలో ఏడు పనిచేయడం లేదు. అదేవిధంగా 904 సింగిల్‌ విలేజ్‌ స్కీమ్‌లు ఉండగా, వాటిలో 65 పథకాలు పనిచేయడం లేదు. జిల్లాలో 30 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సిపిడబ్ల్యుఎస్‌) ఉన్నాయి. వాటిలోనూ చిన్నపాటి రిపేర్లు ఉన్నాయి. చేతిపంపులు, డైరెక్టు పంపు పథకాల్లోనూ మరమ్మతులకు గురయ్యాయి. జిల్లాలో చేతిపంపులు, డైరెక్ట్‌ పంపింగ్‌ పథకాలు కలిపి మొత్తం 13,885 ఉన్నాయి. వాటిలో తాగునీటి యోగ్యంగా 12,808 చేతిపంపులు ఉండగా, 1077 పంపుల్లో నీరు తాగేందుకు పనికిరానిదిగా అధికారులు గుర్తించారు. తాగడానికి ఉపయోగపడే వాటిలో 271 పంపులు పనిచేయడం లేదు. తాగడానికి యోగ్యం కాని వాటిలో 37 పథకాలు మూలకు చేరాయి.బోరుమంటున్న బావులుజిల్లాలో మొత్తం 65 సింగిల్‌ విలేజ్‌ స్కీమ్‌లు మరమ్మతులకు గురికాగా, అందులో హిరమండలం మండలంలో అత్యధికంగా 25 పథకాలు మూలకు చేరాయి. ఎల్‌ఎన్‌పేటలో 20 పథకాలు, జలుమూరులో 11 పథకాలు పాడయ్యాయి. చిన్న రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి మందసలో మూడు, పలాసలో రెండు పథకాలు పాడయ్యాయి. తాగునీటికి యోగ్యం ఉన్న చేతిపంపుల్లో 271 చేతిపంపులు మరమ్మతులకు గురయ్యాయి. వీటిలో హిరమండలం మండలంలో అత్యధికంగా 35 పంపులు పాడయ్యాయి. మందసలో 27, రణస్థలంలో 25, ఎచ్చెర్లలో 21 పంపులు మూలకు చేరాయి.జిల్లాలో నీటి ఎద్దడి పరిస్థితి ఇలా…జిల్లాలో పలుచోట్ల మంచినీటి పథకాలు ఏళ్ల తరబడి ఇంకా నిర్మాణ దశల్లోనే ఉండడంతో, ఆయా గ్రామాలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది. జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని 93 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు శ్రీముఖలింగం తాగునీటి పథకాన్ని 2017లో ప్రారంభించారు. పథకానికి మొదట విడత ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్లతో పనులు పూర్తి చేసి 47 గ్రామాలకు నీరందిస్తున్నారు. రెండో విడత పనులకు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపినా, నిధుల విడుదల్లో జాప్యం కావడంతో పనులు కాక మిగిలిన గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటడంతో మంచినీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బూర్జ మండలం కొల్లివలసలో ఐదు చేతిపంపులు ఉన్నా, వాటిలో మూడింటిలో ఉప్పునీరే వస్తోంది. దీంతో సమీపంలోని బావి నుంచి మహిళలు నీరు తెచ్చుకుంటున్నారు. బావిలో సుమారు 50 అడుగుల లోతులోకి నీరు చేరడంతో తోడుకుని మహిళలు మోసుకువెళ్తున్నారు. వంశధార, నాగావళి, బాహుదా నదులు ఎండిపోవడంతో సమీపంలోని గ్రామాల ప్రజలు చెలమలపై ఆధారపడుతున్నారు. మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల నీరే దిక్కుపలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల నీరే దిక్కుగా ఉంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని హడ్కో కాలనీ, రాజాం కాలనీ, మున్సిపల్‌ కార్యాలయం వీధి, బత్తుల వీధి, నెహ్రునగర్‌, శ్రీనివాసనగర్‌ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఏర్పాటయిన నాటి నుంచి మొదటి మూడు వార్డులకు తాగునీటి పైపులైన్లే ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడి ప్రజలు తాగునీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.

 

➡️