గ్రామస్థాయి నుంచి పారిశుధ్య పనులు

గ్రామస్థాయి నుంచి

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు

* కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

గ్రామస్థాయి నుంచి పారిశుధ్య పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. మలేరియా నిర్మూలన మాసోత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సమీక్షించారు. పారిశుద్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుధ్యంపై డిపిఒ, మున్సిపల్‌ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. పారిశుధ్య పరిస్థితులు బాగుంటే సీజనల్‌ వ్యాధులు ఉండవని చెప్పారు. మలేరియా పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే తక్షణమే ఆ గ్రామాలు, వార్డుల్లో ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా మలేరియా అధికారి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశముందన్నారు. ఇటీవల పలాస మున్సిపాలిటీలో ఒకటి, మందసలో ఒకటి మలేరియా కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాది 54 డెంగీ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆరు కేసులు వచ్చాయని చెప్పారు. పొందూరు, రణస్థలం, సింగుపురం, కొర్లాం, శ్రీకాకుళం, హిరమండలంలో ఒక్కో కేసు నమోదైందన్నారు. గతేడాది 11 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటివరకు రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో స్ప్రేయింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో డ్రై డేగా పాటిస్తున్నట్లు తెలిపారు. మత్స్యశాఖ నుంచి ఐదు లక్షల గంబూషియా చేపలు అవసరమని డిఎంఒ తెలిపారు. సమావేశంలో ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ ప్రసాదరావు, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జి.జె బెన్హర్‌, డిపిఒ వెంకటేశ్వరరావు, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️