రెండో దశ ర్యాండమైజేషన్‌ పూర్తి

సార్వత్రిక ఎన్నికల్లో

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇవిఎంల రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి సమక్షంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇవిఎంల రెండో దశ ర్యాండమైజేషన్‌ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్‌ పూర్తి చేశామన్నారు. ఎన్నికల పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి మాట్లాడుతూ మొదటి దశ ఇవిఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో పూర్తయిందన్నారు. తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించడమైందని, రెండో దశలో ఇవిఎంలను పోలింగ్‌ కేంద్రాల వారీగా కేటాయింపు చేస్తారని వివరించారు. సమావేశంలో ఆమదాలవలస రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, శ్రీకాకుళం, నరసన్నపేట ఆర్‌ఒలు సిహెచ్‌ రంగయ్య, రామ్మోహన్‌, ఇవిఎంల నిర్వహణ నోడల్‌ అధికారి, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ సుధ, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌.జయప్రకాష్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️