సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె

రిమ్స్‌ కార్మికుల

ధర్నా చేస్తున్న రిమ్స్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు

  • రిమ్స్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రిమ్స్‌ కార్మికుల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని రిమ్స్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు బి.మురళి, కోశాధికారి ఆర్‌.చిన్నారావు, సిఐటియు నగర కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు హెచ్చరించారు. లేకుటే తర్వాత పరిణామాలకు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ రిమ్స్‌ వైద్య కళాశాల, సర్వజనాస్పత్రిలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు సర్వజనాస్పత్రి ప్రధాన గేటు వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్‌లో శానిటేషన్‌, సెక్యూరిటీ కార్మికుల వేతనాలు, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ క్రమం తప్పకుండా చెల్లించడం లేదని చెప్పారు. ఏళ్ల తరబడి వేతనాలు పెంచుకుండా వెట్టిచాకిరీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత్తం అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్లుగా ఉన్న కృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ ఏజెన్సీ, సాయి సెక్యూరిటీ ఏజెన్సీ యాజమాన్యాలు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ వారికి నచ్చినట్లు చెల్లిస్తున్నారని తెలిపారు. మూడేళ్లలో ఒక్కసారీ నిర్ణీత వేళల్లో వేతనాలు చెల్లించలేదని విమర్శించారు. కోవిడ్‌ సమయంలో మృతి చెందిన వారికి నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ రెండు ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కాస్‌ పరిధిలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులకు అమలు చేస్తున్న రూ.21వేల వేతనాన్ని రిమ్స్‌ కార్మికులకు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.కృష్ణవేణి, ఎ.సావిత్రి, కె.రవి, ఎం.సూర్యనారాయణ, బి.సంతోషి, డి.భారతి తదితరులు పాల్గొన్నారు.

➡️